ముంబై: భారత పసిడి డిమాండ్ 2017–18 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 8 శాతం పడిపోయింది. డిమాండ్ 187.2 టన్నులుగా నమోదయ్యింది. 2016–17 ఇదే కాలంలో దేశీయ పసిడి డిమాండ్ 202.6 టన్నులు. ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించి ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ (జీడీటీ) నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఈ వివరాలను తెలిపింది. ధరలు అధికంగా ఉండటం, సీజనల్ అంశాలు దీనికి కారణం. ముఖ్యాంశాలు చూస్తే...
►ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో విలువ రూపంలో పసిడి డిమాండ్ రూ.52,692 కోట్లు. 2017 ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ. 52,750 కోట్లు.
►ఆభరణాలకు సంబంధించి పరిమాణ డిమాండ్ 8 శాతం తగ్గింది. 161 టన్నుల నుంచి 147.9 టన్నులకు పడిపోయింది. విలువలో ఒకశాతం తగ్గి రూ.41,925 కోట్ల నుంచి రూ.41,631 కోట్లకు తగ్గింది.
►పెట్టుబడుల డిమాండ్ పరిమాణంలో 5 శాతం తగ్గి 41.6 టన్నుల నుంచి 39.3 టన్నులకు పడింది. అయితే విలువలో మాత్రం 2 శాతం పెరిగి రూ.10,825 కోట్ల నుంచి రూ.11,061 కోట్లకు చేరింది.
► దేశంలో రీసైకిల్డ్ గోల్డ్ 8 శాతం పెరిగి 29.6 టన్నుల నుంచి 32 టన్నులకు ఎగసింది.
►పసిడి దిగుమతులు త్రైమాసికంలో 38 శాతం పడిపోయి 274 టన్నుల నుంచి 170 టన్నులకు పడిపోయింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (జనవరి–జూన్)లో దిగుమతులు 13.51 శాతం తగ్గి 555 టన్నుల నుంచి 480 టన్నులకు పడ్డాయి.
► ఏడాది మొత్తంమీద దేశ పసిడి డిమాండ్ 700 నుంచి 800 టన్నుల శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నట్లు డబ్ల్యూజీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. దేశంలో పసిడి పరిశ్రమ స్థిరీకరణ దశలో ఉందనీ, దీర్ఘకాలంలో పరిశ్రమకు ఇది లాభిస్తుందన్నారు.
అంతర్జాతీయంగా 4 శాతం పతనం
కాగా అంతర్జాతీయంగా ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 4 శాతం పడింది. 964.3 టన్నులుగా నమోదయ్యింది. 2017 ఇదే కాలంలో ఈ డిమాండ్ 1,007.5 టన్నులు.
Comments
Please login to add a commentAdd a comment