న్యూఢిల్లీ: పసిడికి డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. 2022 ఏప్రిల్-జూన్ కాలంలో భారతీయులు 170.7 టన్నుల బంగారం కొనుగోలు చేశారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో పుత్తడి కొనుగోలుకు కస్టమర్లు చేసిన వ్యయం 54 శాతం పెరిగి రూ.79,270 కోట్లకు చేరుకుంది. 2022లో మొత్తం 800-850 టన్నుల బంగారానికి డిమాండ్ ఉండవచ్చు. 2021లో భారత్‌లో 797 టన్నుల మేర పుత్తడి అమ్మకాలు నమోదయ్యాయి.
అభరణాలే అధికం..
అక్షయ తృతీయ, సంప్రదాయ వివాహ వేడుకల కారణంగా జూన్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 49 శాతం దూసుకెళ్లి 140.3 టన్నులుగా ఉంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 94 టన్నులు మాత్రమే. వినియోగదార్లు కొనుగోలు చేసిన ఆభరణాల విలువ క్రితం ఏడాదితో పోలిస్తే జూన్ త్రైమాసికంలో రూ.40,610 కోట్ల నుంచి రూ.65,140 కోట్లకు ఎగసింది. పెట్టుబడి కోసం కొనుగోలు చేసిన బంగారం 20 శాతం వృద్ధి చెంది 30.4 టన్నులుగా ఉంది. వీటి కోసం చేసిన వ్యయం 29 శాతం పెరిగి రూ.14,140 కోట్లకు చేరుకుంది. పునర్వినియోగమైన (రీసైకిల్డ్) బంగారం 18 శాతం అధికమై 23.3 టన్నులకు దూసుకెళ్లింది. గడిచిన త్రైమాసికంలో 170 టన్నుల దిగుమతి అయింది. 2021 ఏప్రిల్-జూన్‌లో ఇది 131.6 టన్నులు.
సెంటిమెంట్‌పై ప్రభావం..
ద్రవ్యోల్బణం, పసిడి ధర, రూపాయి-డాలర్ మారకం, విధాన చర్యలు వినియోగదార్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. రూపాయి, డాలర్ మారకంపై దృష్టి సారించినప్పటికీ ఆర్థిక దృక్పథంపై అనిశ్చితి, అధిక దిగుమతి సుంకం, తాత్కాలిక, వ్యూహాత్మక కారణాల వల్ల బంగారం కొనుగోలుపై అదనపు ఆంక్షలు విధించే అవకాశం కారణంగా ఈఏడాది రెండో అర్ధభాగంలో దేశీయంగా ఆభరణాల డిమాండ్ ప్రతికూల ముప్పును ఎదుర్కొంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఇలా..
అంతర్జాతీయంగా పుత్తడి డిమాండ్ ఏప్రిల్-జూన్‌లో 8 శాతం పడిపోయి 948.4 టన్నులకు వచ్చి చేరింది. గోల్డ్ ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి ఉపసంహరణలు పెరగడం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లలో క్షీణత, టెక్నాలజీ విభాగం నుండి డిమాండ్ తగ్గడం వంటి కారణాలు ఇందుకు కారణమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. పెట్టుబడి కోసం కొనుగోలు చేసిన బంగారం 28 శాతం తగ్గి 205.8 టన్నులుగా ఉంది. భారత మార్కెట్ తోడుగా నిలవడంతో ఆభరణాల డిమాండ్ 6.15 శాతం పెరిగి 484.3 టన్నులకు చేరుకుంది. చైనాలో ఆభరణాల అమ్మకాలు 28 శాతం పడిపోయాయి. 2022 జనవరి-జూన్‌లో గోల్డ్ డిమాండ్ 12 శాతం అధికమై 2,189 టన్నులకు ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment