అప్పుల ఊబిలో... కార్పొరేట్ ఇండియా!
భారీ రుణాల్లో 250 పైచిలుకు సంస్థలు
- భారం తగ్గించుకునేందుకు రూ. 7 లక్షల కోట్లు కావాలి
- ఇండియా రేటింగ్స్ నివేదిక
ముంబై: దేశీయంగా భారీగా అప్పులు తీసుకున్న టాప్ 500 కంపెనీల్లో సగభాగం పైగా సంస్థలు గట్టెక్కాలంటే ఏకంగా రూ. 7 లక్షల కోట్లు అవసరమవుతాయని ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. భారాన్ని తగ్గించుకునేందుకు వాటాల విక్రయం బాట పడితే 262 సంస్థలు కనీసం రూ. 7,04,300 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని, బైటపడేందుకు మూడేళ్లు అవసరమవుతుందని వివరించింది. అయితే, ఇంత పెద్ద మొత్తాన్ని వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకోవడం అంత సులువు కాకపోవచ్చని ఇండియా రేటింగ్స్ సీనియర్ డెరైక్టర్ (ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం) దీప్ ఎన్ ముఖర్జీ నివేదికలో పేర్కొన్నారు. 2007-08, 2013-14 మధ్యకాలంలో ఈ మొత్తంలో సుమారు సగభాగం ఈ 500 కంపెనీల్లోకి వచ్చేసిందని వివరించారు.
ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా ఉండి, ఈ కంపెనీలు తమ రుణభారాన్ని ఒక మోస్తరు స్థాయికి తగ్గించుకోవాలంటే ఈ ప్రక్రియకు కనీసం మూడేళ్లు పట్టేస్తుందని తెలిపారు. అయితే, రుణాలు ఇప్పుడున్న స్థాయిలోనే ఉండాలని, పెరగకూడదని పేర్కొన్నారు. ఒకవేళ వృద్ధి అత్యంత స్వల్పంగా ఉన్న పక్షంలో ఈ ప్రక్రియకు అయిదారేళ్లు పట్టేస్తుందన్నారు.
సీడీఆర్‌లో 96 కంపెనీలు..
దాదాపు 96 కంపెనీలు ఇప్పటికే కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ (సీడీఆర్) ప్రక్రియలో ఉండటమో లేదా నిరర్థక ఆస్తుల జాబితాకి ఎక్కడమో జరిగిందని ఇండియా రేటింగ్స్ వివరించింది. ఇవి తమ రుణాలను ఒక మోస్తరు స్థాయికి తగ్గించుకునేందుకు 5-10 సంవత్సరాలు పడుతుందని తెలిపింది. ఈ 96 కంపెనీల్లో 62 సంస్థలు మనుగడ సాగించాలంటే కనీసం రూ. 2,41,000 కోట్లు అవసరమవుతాయి. ఈ జాబితాలోని చాలామటుకు కంపెనీల మార్కెట్ విలువ కన్నా కూడా ఇది అధికం. కొత్త ఈక్విటీ అయినా ఆయా కంపెనీల ప్రమోటర్లు మారితేనే వస్తుందని, లేకపోతే మరింత కాలం అప్పుల భారం మోయాల్సి వస్తుందని ఇండియా రేటింగ్స్ వివరించింది. దన్నుగా నిల్చే మాతృసంస్థలు గానీ ఇతరత్రా వనరులు గానీ లేకపోవడం వల్ల 96 కంపెనీల జాబితాలోని 87 సంస్థల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని హెచ్చరించింది.
ఇక, ఈ 87 సంస్థల్లో 71 కార్పొరేట్లు మరింత సంక్షోభంలోకి జారకుండా ఉండాలంటే రాబోయే ఆరు నుంచి పన్నెండు నెలల్లో వాటాల విక్రయం ద్వారా కనీసం రూ. 89,200 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. అలా జరగని పక్షంలో అవి ఒక మోస్తరుగా కోలుకోవడానికి అయిదు నుంచి ఎనిమిదేళ్లు పడుతుందని నివేదికలో ముఖర్జీ వివరించారు. తక్షణమే ప్రమాదం లేని 317 కార్పొరేట్లలో 128 సంస్థలకు సుమారు రూ. 3.7 లక్షల కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు.