ఆర్థిక విప్లవానికి భారత్ రెడీ!
⇒ విదేశీ పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్నాం
⇒ అనవసరమైన నియంత్రణలకు ఇక చెల్లు...
⇒ ఆమోదయోగ్య, స్థిరమైన పన్నుల వ్యవస్థ...
⇒ చైనా పర్యటనలో భారత్ ప్రధాని మోదీ వెల్లడి...
బీజింగ్: ఆర్థిక విప్లవం దిశగా భారత్ సమరశంఖం పూరించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
విదేశీ ఇన్వెస్టర్లకు సానుకూల వాతావరణాన్ని కల్పించడంతోపాటు... అనవసరమైన నియంత్రణలకు చెల్లుచెప్పడం, ఆమోదయోగ్యమైన పన్నుల వ్యవస్థ కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన చెప్పారు. తాము తీసుకొస్తున్న భూసేకరణ చట్టం... వృద్ధికి ఆటంకం కలగకుండా, మరోపక్క రైతులకు భారం కాకుండా ఉంటుందని ఇన్వెస్టర్లకు ఆయన హామీనిచ్చారు. చైనా పర్యటనలో భాగంగా శుక్రవారం ఇక్కడ చింగ్‌హువా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను అత్యుత్తమ వ్యాపార కేంద్రంగా మార్చడానికి అనేక నిబంధనలను సరళతరం చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు.
సాహసోపేతమైన సంస్కరణలు...
మరిన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) కోసం తమ సర్కారు సాహసోపేతమైన సంస్కరణలను చేపట్టిన విషయాన్ని మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. ఇందులో బీమా, నిర్మాణం, రక్షణ రంగం, రైల్వేలు కూడా ఉన్నాయన్నారు. ‘రోడ్లు, పోర్టులు, రైల్వేలు, విమానాశ్రయాలు, టెలికం, డిజిటల్ నెట్‌వర్క్‌లు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భవిష్యత్తు తరం మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా పెట్టుబడుల కోసం భారత్ చర్యలు చేపడుతోంది.
వీటి అమలు కోసం గడచిన ఏడాది కాలంలో అనేక వేగవంతమైన నిర్ణయాలను తీసుకున్నాం. స్థిరమైన పన్నుల వ్యవస్థను రూపొందిస్తున్నాం’ అని ప్రధాని వివరించారు. ‘భారత్ వృద్ధి రేటు 7.5%కి ఎగబాకిన విషయాన్ని గుర్తించాలి. దీన్ని మరింత పెంచేందుకు ఎగుమతులను ప్రోత్సహిస్తున్నాం. భారత్, చైనా ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు కొత్తపుంతలు తొక్కనున్నాయని మోదీ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు చైనా ముందుకొచ్చిందన్నారు. రైల్వేల ఆధునీకరణ, రెండు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుతో పాటు మేక్ ఇన్ ఇండియాలో నూ పాలుపంచుకోనుందని పేర్కొన్నారు.
వాణిజ్య లోటు కట్టడికి టాస్క్‌ఫోర్స్...
చైనా నుంచి భారత్‌కు దిగుమతులు వెల్లువెత్తుతుండటం... ఆ దేశంతో భారత్ వాణిజ్య లోటు భారీగా పెరుగుతుండటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ప్రధాని లీ కెకియాంగ్‌లు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే దీనికి పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాణిజ్యలోటు పెరగకుండా చూసేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల పెంపునకు ఒక వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంపైన కూడా టాస్క్‌ఫోర్స్ దృష్టిపెడుతుందని వెల్లడించారు.
ఐటీ, ఫార్మా, వ్యవసాయం, ఇతర తయారీ రంగాలకు చెందిన ఉత్పత్తులకు చైనా మార్కెట్లో మరింత అవకాశాలు కల్పించాలని భారత్ కోరుతోంది. భారత్ నుంచి చైనాకు ఎగుమతులను పెంచేందుకు వీలుగా నియంత్రణపరమైన అడ్డుంకులను తొలగించాలని పేర్కొంటోంది. 2013-14లో చైనాతో భారత్ వాణిజ్య లోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 36.21 బిలియన్ డాలర్లు కాగా, 2014-15లో ఇది 34 శాతం ఎగబాకి 48.44 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ప్రాథమిక గణాంకాల ప్రకారం 2013-14లో భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 11.95 బిలియన్ డాలర్లుకాగా, దిగుమతులు 60.39 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
నేడు 10 బిలియన్ డాలర్ల ఒప్పందాలు...
నేడు(శనివారం) ప్రధాని మోదీ... భారత్-చైనా వ్యాపార వేదిక నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపార ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. షాంఘైలో జరిగే ఈ సమావేశానికి భారత్, చైనాలకు చెందిన దిగ్గజ కంపెనీల చీఫ్‌లు హాజరుకానున్నారు.