సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో సరైన ప్రోత్సాహం లేక ఎదగలేకపోతున్న ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) పరిశ్రమకు 15,400 కోట్ల డాలర్ల ఐటీ పరిశ్రమ తోడుగా నిలిచింది. ఈవీలను ప్రోత్సహించేందుకు తామున్నామంటూ ముందుకు వస్తోంది. టాటా మోటార్స్ కంపెనీ కూడా హైదరాబాద్‌లోని ‘కాగ్నిజెంట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’కి కనీసం పది ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా చేస్తున్నట్లు ఇటీవలనే ప్రకటించింది. అలాగే ఈవీలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ నగరంలో రెండు చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
అంతకుముందు భారత్‌లో మూడవ అతిపెద్ద ఐటీ ఔట్ సోర్సింగ్ కంపెనీ అయిన విప్రో, 2030 నాటికి ప్రపంచంలోని తన అన్ని క్యాంపస్‌లు ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగిస్తాయని తెలిపింది. మరో మూడేళ్లలో తాము 500 వాహనాలను, 2023 నాటికి వెయ్యి ఈవీలను కొనుగోలు చేస్తామని విప్రో ప్రకటించింది. అంటే దేశంలో ప్రస్తుతం ఏడాదికి అమ్ముడుపోతున్న ఈవీలలో సగం వాహనాలను విప్రోనే కొనుగోలు చేస్తుందన్నమాట. ఇప్పటికే దేశంలోని అనేక ఐటీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నాయి. అయితే ప్రాథమిక మోడళ్లను మాత్రమే కొనుగోలు చేసి క్యాంపస్‌లలోనే నడుపుతున్నాయి. ఉద్యోగులను క్యాంపస్‌లో ఓ చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లేందుకు వీటిని వినియోగిస్తున్నాయి. ఆ వాహనాలు రోడ్ల మీదకు రావాలంటే మరి కొంత సమయం పడుతున్నాయి. చార్జింగ్ స్టేషన్ల లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాక రోడ్లపైకి వాటిని తీసుకొస్తామని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి.
‘మా ఉద్యోగులకు కాలుష్య రహిత పర్యావరణ హిత రవాణా సౌకర్యాన్ని కల్పించడం కోసం ఇటీవలనే కొన్ని ఈవీలను కొనుగోలు చేశామ’ని కాగ్నిజెంట్ కంపెనీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ రామ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులలోని క్యాంపస్‌లలో వీటిని వినియోగిస్తున్నామని కొంతకాలంలో దేశంలోని అన్ని క్యాంపస్‌లలో వీటిని ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. విప్రో సంస్థ కూడా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పూణె క్యాంపస్‌లలో ఈవీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ క్యాంపస్‌లన్నింటిలో కలిపి విప్రోకు రెండు వేల వాహనాలు అవసరమని అభిప్రాయపడింది. ఇప్పటికే హైదరాబాద్ క్యాంపస్ కోసం ఇప్పటికే 50 వాహనాలను లీజుకు తీసుకున్నట్లు తెలిపింది.
పెన్సిల్వేనియా ప్రధాన కార్యాలయంగా ఐటీ కంపెనీ యునిసిస్‌లో భాగమైన యునిసిస్ ఇండియా 2015 సంవత్సరం నుంచే ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తోంది. తమ ఈవీలన్నీ లిథియమ్ ఐయాన్ బ్యాటరీలపై నడుస్తున్నాయని, నెలకు నాలుగు లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ‘ఐటీ క్యాంపస్సుల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. నలుగురికి దారిచూపే టార్చిలైట్లు పట్టుకోవడానికి ఐటీ కంపెనీ ఇష్టపడతాయి. అందుకని వాటికి ఈవీలు ఎంతో అనువైనవి’ అని ఆటో ఇండస్ట్రీ కన్సల్టెన్సీ ఎమర్జింగ్ మార్కెట్స్ ఆటోమోటివ్ అడ్వైజర్స్ డైరెక్టర్ దీపక్ రాథోర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment