
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో పది బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో టాటా మోటార్స్‌లో భాగమైన టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తమ విద్యుత్ వాహనాలకు సంబంధించి కొత్త బ్రాండ్ గుర్తింపును ఆవిష్కరించింది. ’టాటాడాట్‌ఈవీ’ బ్రాండింగ్‌తో కొత్త శకంలోకి ప్రవేశిస్తున్నట్లు సంస్థ హెడ్ (మార్కెటింగ్) వివేక్ శ్రీవత్స తెలిపారు.
కస్టమర్లకు మరింత వైవిధ్యమైన, అర్థవంతమైన అనుభూతిని అందించేందుకు ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. కంపెనీకి ప్రస్తుతం నాలుగు చక్రాల ఈవీల సెగ్మెంట్‌లో 70 శాతం పైగా మార్కెట్ వాటా ఉంది. నెక్సాన్, టియాగో, టిగోర్, ఎక్స్‌ప్రెస్–టీ పేరిట ఈవీలను విక్రయిస్తోంది.
2026 నాటికి పది కొత్త ఈవీలు ఆవిష్కరించే దిశగా 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. 2030 నాటికల్లా తమ మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో విద్యుత్ వాహనాల వాటా సగానికి పైగా ఉంటుందని టాటా మోటార్స్ భావిస్తోంది. ఈ ఏడాది 1 లక్ష పైచిలుకు ఈవీలు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment