షావొమీ... ‘స్మార్ట్’ బాట!
దశలవారీగా భారత్‌లో స్మార్ట్ ఉపకరణాలు
ఈ ఏడాదే ఎయిర్ ప్యూరిఫయర్స్
షావొమీ ఇండియా హెడ్ మను జైన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న షావొమీ ‘స్మార్ట్’ బాట పట్టింది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఫిట్‌నెస్ బ్యాండ్, పవర్ బ్యాకప్, యాక్సెసరీస్‌ను విక్రయిస్తున్న ఈ సంస్థ వినూత్న స్మార్ట్ ఉపకరణాలను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లను పరిచయం చేయనుంది. టీవీలు, రౌటర్లు, వాటర్ ప్యూరిఫయర్లు, మస్కిటో రెపెల్లెంట్, ఎలక్ట్రికల్ బైసికిల్, డ్రోన్, బూట్లు, రైస్ కుకర్, ల్యాప్‌టాప్‌ల వంటి స్మార్ట్ ప్రొడక్ట్స్‌ను సైతం కంపెనీ తయారు చేస్తోంది. వ చ్చే ఏడాది నుంచి వీటిని దశలవారీగా ఇక్కడి మార్కెట్లోకి తీసుకు రావాలని నిర్ణయించినట్టు షావొమీ ఇండియా హెడ్ మను జైన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు. ప్రతి ఉపకరణాన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించవచ్చని తెలిపారు.
వేటికవే ప్రత్యేకం..: షావొమీ వాటర్ ప్యూరిఫయర్‌లో నాలుగు ఫిల్టర్లుంటాయి. ఏది పాడైనా వెంటనే కస్టమర్ స్మార్ట్‌ఫోన్‌కు, అలాగే కంపెనీ కేంద్ర కార్యాలయానికి సమాచారం వెళ్తుంది. ఒక్క క్లిక్‌తో ఫిల్టర్‌ను ఆర్డరివ్వొచ్చు. టెక్నీషియన్ అవసరం లేకుండానే అయిదు నిముషాల్లో బిగించొచ్చు కూడా.