ఆ పనికే రోజుకు పదిన్నర గంటలు పోతోంది
న్యూయార్క్: స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లెట్స్, పర్సనల్ కంప్యూటర్స్, మల్టీ మీడియా డివైసెస్, వీడియో గేమ్‌లు, రేడియోలు, డీవీడీలు, డీవీఆర్‌లు, టీవీల స్క్రీన్లపై మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం. ఎవరైనా అధ్యయనం జరిపి, వాటి వివరాలను క్రోడీకరిస్తే చెప్పవచ్చు. వీటిపై అమెరికా పౌరులు మాత్రం రోజుకు సరాసరి సగటున పది గంటల 39 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తున్నారని నీల్సన్ నిర్వహించిన సర్వే వెల్లడించింది.
ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలాన్ని పరిగణలోకి తీసుకొని సర్వే చేయగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. గతేడాది ఇదే కాలానికి అమెరికా పౌరులు ఈ స్క్రీన్లపై వెచ్చించిన సమయం 9 గంటల, 39 నిమిషాలు. అంటే గతేడాదికి ఈ ఏడాదికి వీటిపై వెచ్చిస్తున్న సమయం గంట పెరిగింది. ఫొటోలు తీయడానికి, టెక్స్ట్ టైప్ చేయడానికి పడుతున్న సమయాన్ని ఈ పదిన్నర గంటలలోకి తీసుకోలేదు.
ఎక్కువ వరకు స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడం వల్ల ఈ గంట సమయం పెరిగింది. నెట్‌ఫిక్స్, హులు లాంటి ఆన్‌లైన్ డిమాండ్ ద్వారా సినిమాలు చూడడం వల్ల కూడా ఇందులో కొంత సమయం పెరిగినట్లు గుర్తించారు. ఈ వివరాలేవీ తనకు ఆశ్చర్యానికి గురి చేయడం లేదని, ఎలక్ట్రానిక్ డివైసెస్ పెరుగుతుండడం వల్ల స్క్రీన్లపై మనం వెచ్చిస్తున్న సమయం పెరుగుతోందని, వచ్చే ఏడాది ఇది మరింత పెరిగే ప్రమాదం ఉందని హార్వర్డ్ యూనివర్శిటీలోని హెల్త్ సోషియాలోజి విభాగానికి చెందిన ప్రొఫెసర్ స్టీవ్ గోర్ట్‌మేకర్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి సర్వేకు, ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఇలా వెచ్చిస్తున్న సమయంపోను మిగతా సమయాన్ని మనిషి ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారన్నదే తన ముఖ్యమని ఆయన అన్నారు.
అమెరికాలోని పెద్దవాళ్లలో 81 శాతం మందికి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయని, వారు తమ స్మార్ట్‌ఫోన్లను వారు రోజులో సరాసరి సగటున గంటా 39 నిమిషాలు ఉపయోగిస్తున్నారని సర్వే వెల్లడించింది. అమెరికాలో ఇప్పటికీ రేడియోలు, టెలివిజన్లను ఉపయోగించడం విశేషం. 94 శాతం పెద్దవారికి అక్కడ హెచ్‌డీ టెలివిజన్లు అందుబాటులో ఉన్నాయి. వారు సినిమాలు, ఇతర కార్యక్రమాలను రోజుకు నాలుగున్నర గంటలపాటు టెలివిజన్‌లో వీక్షిస్తున్నారు. వారానికి 168 గంటలు. వాటిలో నిద్రకుపోయే సమయాన్ని రోజుకు ఆరు గంటల చొప్పున తీసేస్తే మిగిలే సమయం 126 గంటలు. అందులో ఆఫీసులో పనిచేసే కాలాన్ని వారానికి 40 గంటలు తీసేస్తే మిగిలే సమయం 86 గంటలు.
కాలకృత్యాల నుంచి మొదలుకొని స్నానం చేసేవరకు, వంట వండుకొని తిని ఆఫీసుకు బయల్దేరే వరకు వ్యక్తిగత పనులకు రోజుకు మూడు గంటల చొప్పున వారానికి 21 గంటలను తీసేస్తే మిగిలే సమయం 65 గంటలు. రోజుకు పదిన్నర గంట బదులు పది గంటలనే స్క్రీన్లపై వెచ్చిస్తున్నామనుకొని లెక్కిస్తే దానికే వారానికి 70 గంటలు కావాలి. అంటే మిగిలే సమయమే అమెరికా పౌరులకు లేదన్నమాట. నిద్రనో, వ్యక్తిగత పనులకు వెచ్చిస్తున్న సమయాన్నో వారు ఇందుకు ఉపయోగించుకుంటున్నారని అర్థం చేసుకోవాలి.
ఇక వ్యక్తిగల అలవాట్ల విషయానికి వస్తే వాకింగ్, జాగింగ్, స్నేహితులతో ముచ్చట్లు, వీకెండ్ పార్టీలు, పిల్లలతో గడిపేందుకు ఒక్క నిమిషం కూడా మిగలడం లేదన్న మాట. ఇలాంటి పరిస్థితుల కారణంగానే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆటలు, పాటలు లేకుండా పిల్లలు స్క్రీన్లకే అతుక్కు పోతుండడం వల్ల అమెరికాలో ఊబకాయం సమస్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు తరుణోపాయం కనుక్కోవాల్సిందే!