బిగ్‌బజార్‌లో భారీ చోరీ | Big bazaar massive theft | Sakshi
Sakshi News home page

బిగ్‌బజార్‌లో భారీ చోరీ

Published Sun, Aug 24 2014 4:35 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

Big bazaar massive theft

సుల్తాన్‌బజార్: ఒకప్పుడు ఉపాధినిచ్చి..ఆదుకున్న సంస్థకే కన్నం వేశారా ప్రబుద్ధులు. రూ.50 లక్షలకు పైగా విలువైన లాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దోచుకున్నారు. ఈ సంఘటన శనివారం నగరంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాచిగూడ క్రాస్ రోడ్‌లోని బిగ్‌బజార్‌ను శుక్రవారం రాత్రి ఎప్పటిలాగానే పని వేళలు ముగిసిన తరువాత మూసేశారు.

శనివారం తెల్లవారు జామున 3 గంటలకు సెక్యూరిటీ చెక్ నిర్వహించారు. డిస్‌ప్లేలో కొన్ని ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్‌లు కనిపించ కపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ముగ్గురు వ్యక్తులు ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలిస్తున్నట్లు అందులో గుర్తించారు. వెంటనే విషయాన్ని బిగ్‌బజార్ ఉన్నతాధికారులకు సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, సుల్తాన్‌బజార్ పోలీసులను ఆశ్రయించారు.

ఏసీపీ రవికుమార్, డీఐ కిషోర్ లు సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి, వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. సిబ్బందిని విచారించారు. బిగ్‌బజార్ మేనేజర్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
 
ప్రణాళిక ప్రకారమే...
 
గతంలో బిగ్‌బజార్ లో పనిచేసి, మానివేసిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులుపక్కా ప్రణాళికతో చోరీ చేశారని సీసీ కెమెరా ఫుటేజ్‌ల ద్వారా తెలుస్తోంది. అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లకు చెందిన పప్పుదాస్, కమల్‌దాస్, రజినిపెగ్‌లు బిగ్‌బజార్‌లో 3వ ప్లోర్‌లోని ఫైర్‌ఎగ్జిట్ ద్వారం నుంచి 2వ అంతస్తులోని ఎలాక్ట్రానిక్ విభాగంలోకి ప్రవేశించి అక్కడున్న ఖరీదైన ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్‌లు, కెమెరాలను,  తర్వాత పక్కనే ఉన్న స్టోర్‌రూమ్, స్టాఫ్‌రూమ్‌ల తాళాలను పగులగొట్టి లోనికి వెళ్లి రెండు బీరువాల తాళాలను పగులగొట్టి అందులో ఉన్న ఖరీదైన సెల్‌ఫోన్‌లను ఎత్తుకెళ్లారు. మొత్తం పరికరాల విలువ రూ.50లక్షలకు పైనేనని సిబ్బంది చెబుతున్నారు.
 
సీసీ కెమెరాల వైర్లు కత్తిరించి: ముగ్గురు వ్యక్తులు లోనికి వస్తూనే కొన్ని సీసీ కెమెరాల వైర్లను కత్తిరించారు. ఓ కెమెరా వైర్లు కత్తిరించకపోవడంతో చోరీ దృశ్యాలు చిక్కాయి. అర్ధరాత్రి 12 గంటల 52 నిమిషాల నుంచి ఒంటిగంటన్నర వరకు చోరీ చేశారు. నిందితులు 4 సూట్‌కేసులు, 6 బ్యాగులను తీసుకువచ్చి వాటిలో చోరీ చేసిన వస్తువులు తీసుకుని దర్జాగా ఆటోలో వెళ్లిపోయారు. చివరకు రాత్రి డ్యూటీలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్ వద్ద నిందితుడు కూల్‌డ్రింక్ తాగి మరీ వెళ్లడం గమనార్హం.
 
కీలకం కానున్న ఫోన్‌కాల్: చోరీ చేస్తున్న సమయంలో ముగ్గురిలో ఒకడు సరిగ్గా 1.05 గంటలకు ఎవరికో ఫోన్ చేశాడు. ఈ దృశ్యాలను సీసీ కెమెరాలో చూసిన పోలీసులు ఫోన్ కాల్‌పై దృష్టి పెట్టారు. బిగ్‌బజార్ నుంచిఆ సమయంలో వారు ఎక్కడికి ఫోన్ చేశారు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితుల బయోడేటా ఆధారంగా వారి ఫొటోలను సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
నగరంలోనే నిందితులు?
 
నిందితులు పప్పుదాస్, కమల్‌దాస్, రజినిపెగ్‌ల పట్టుకునేందుకు 3 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నిందితులు అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లకు చెందిన వారు. అసోం వె ళ్లేందుకు సోమవారం ఉదయం రైలుఉంది. మరే ఇతర మార్గాల ద్వారా నిందితులు వెళ్లినా పోలీసులకు దొరికిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీన్నిబట్టి నిందితులు న గరం, శివారు ప్రాంతాలలో ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
 
నిందితులను పట్టుకుంటాం: కాచిగూడ క్రాస్‌రోడ్స్‌లోని బిగ్‌బజార్‌లో గుర్తు తెలియని వ్యక్తులు 35 సెల్‌ఫోన్‌లు, 15 ల్యాప్‌ట్యాప్‌లు. 7 కెమెరాలు చోరీ చేశారని ఏసీపీ రవికుమార్ విలేకరులకు తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. 3 బృందాలతో గాలింపు చర్యలు మొదలుపెట్టామని ఆయన తెలిపారు. తన పర్యవేక్షణలో సుల్తాన్‌బజార్ డీఐ కిషోర్‌కుమార్  దర్యాప్తు చేస్తున్నార ని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement