రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్!
2016కల్లా అమెరికాను వెనక్కినెట్టే చాన్స్
ఈమార్కెటీర్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు జోరుగా ఉన్నాయి. 2016 కల్లా అమెరికాను తోసిరాజని స్మార్ట్‌ఫోన్లకు రెండో అతి పెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించనున్నది. కంపెనీలు అందుబాటు ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను అందించడమే దీనికి కారణమని ప్రముఖ రీసెర్చ్ సంస్థ, ఈమార్కెటీర్ పేర్కొంది.
ఈ సంస్థ వెలడించిన వివరాల ప్రకారం...,
వృద్ధి చెందుతున్న దేశాల్లో చౌక ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో 2016 కల్లా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 200 కోట్లను దాటనున్నది.
భారత్‌లో 2016 నాటికి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 20 కోట్లకు పెరుగుతుంది. దీంతో అమెరికాను తోసిరాజని భారత్ రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరిస్తుంది.
అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా చైనా తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తుంది. 62.47 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులతో చైనా మొదటిస్థానంలో ఉంటుంది. ఆ తర్వాత స్థానాల్లో భారత్(20 కోట్లు), అమెరికా(19.8 కోట్లు), రష్యా (6.5 కోట్లు), జపాన్(6.1 కోట్లు)లు ఉంటాయి.
వచ్చే ఏడాది స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే వారి సంఖ్య ప్రపంచ జనాభాలో పావువంతు కంటే ఎక్కువగానే ఉండనున్నది. ఇది 2018 కల్లా మొత్తం ప్రపంచ జనాభాలో మూడో వంతుకు పెరగనున్నది.
2015లో 191 కోట్లుగా ఉండే స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 2016లో 13 శాతం వృద్ధితో 216 కోట్లకు, పెరగనున్నది.