ప్రభుత్వ బంగారు కాయిన్ల పట్ల ఆకర్షణ
ముంబై: భారతీయులు బంగారు ఆభరణాల ప్రియులు అన్నది అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బంగారం కాయిన్లు కూడా వారి మనసును గెలుచుకుంటున్నాయి. స్వచ్ఛతకు హామీ, నాణ్యతా ప్రమాణాలు, హాల్ మార్కింగ్, పైగా ప్రభుత్వం అందిస్తున్నవి కావడం సాధారణ బంగారు కాయిన్ల కంటే ‘ఇండియన్ గోల్డ్ కాయిన్’ పట్ల వినియోగదారుల్లో కొనుగోలు ఆసక్తికి కారణమని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నిర్వహించిన సర్వేలో తెలిసింది.
దీపావళి సమయంలో, పుట్టిన రోజులు, పెళ్లి సందర్భాల్లో బహుమతులుగా ఇచ్చేందుకు ఎక్కువ మంది ఈ కాయిన్లను కొనుగోలు చేస్తున్నారని ఈ సర్వే పేర్కొంది. గతేడాది నవంబర్ 5న కేంద్రం ఇండియన్ గోల్డ్ కాయిన్లను విడుదల చేసింది. వీటిపై ఒకవైపు అశోకచక్ర, మరోవైపు మహాత్మాగాంధీ చిత్రాలు ఉంటాయి. వీటిలో 2, 5, 10 గ్రాములకు మంచి ఆదరణ ఉంది. వీటిని ప్రభుత్వ రంగ ఎంఎంటీసీతోపాటు విజయా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యస్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు విక్రయిస్తున్నాయి.