ఆర్థిక రంగ ప్రతికూల వార్తలకు వాహన అమ్మకాల గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటం కూడా తోడవడంతో స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. బ్యాంక్ షేర్లు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవడంతో ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,300 పాయింట్ల దిగువకు పడిపోయాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లు పతనమైంది. ట్రేడింగ్ చివర్లో ఒకింత కొనుగోళ్లు పుంజుకోవడంతో సూచీల నష్టాలు దాదాపు సగం వరకూ తగ్గాయి. ఇంట్రాడేలో 737 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్ చివరకు 362 పాయింట్ల నష్టంతో 38,305 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 115 పాయింట్లు క్షీణించి 11,360 పాయింట్ల వద్ద ముగిశాయి. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 684 పాయింట్లు, నిఫ్టీ 211 పాయింట్ల మేర పతనమయ్యాయి. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎమ్‌సీ)బ్యాంక్ సంక్షోభం మరింత ముదరడం, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వంటి కంపెనీల్లో అవకతవకలు వెలుగులోకి వస్తుండటంతో మార్కెట్లో అప్రమత్త వాతావరణం నెలకొందని నిపుణులంటున్నారు.
లాభాల స్వీకరణకే మొగ్గు...
ఆగస్టులో 8 కీలక రంగాల్లో వృద్ది కుంటుపడటం, పన్నును భారీగా తగ్గించినప్పటికీ 3.3% ద్రవ్యలోటుకే ప్రభుత్వం కట్టుబడి ఉండటంతో ప్రభుత్వ వ్యయం తగ్గుతుందనే అంచనాలు ప్రతికూల ప్రభావం చూపించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. పండగ సీజన్‌లో కూడా వాహన విక్రయాలు పుంజుకునేలా లేవని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. బ్యాంక్ షేర్లు ఒడిదుడుకులకు గురవ్వడం, రూపాయి పతనం.. ఈ రెండు అంశాలు లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లను పురికొల్పాయని వివరించారు.
బ్యాంక్ షేర్లు బేజార్
పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ల్లో అవకతవకలు.. కుదైలన ఎన్‌బీఎఫ్‌సీలకు, సంక్షోభంలో ఉన్న రియల్టీ రంగానికి బ్యాంక్‌లు భారీగా రుణాలిచ్చాయన్న అంచనాలతో బ్యాంక్ షేర్లలో జోరుగా అమ్మకాలు జరిగాయి. మొండి బాకీలు మరింతగా పెరగగలవని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ హెచ్చరించడం మరింత ఆజ్యం పోసింది. ఇప్పటికే ఆర్థిక మందగమనంతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై బ్యాంకింగ్‌లో చోటు చేసుకుంటున్న ప్రతికూల పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఆర్‌బీఎల్ బ్యాంక్ 9% నష్టంతో రూ.300 వద్ద ముగిసింది. ఎస్‌బీఐ బ్యాంక్ 5%, బ్యాంక్ ఆఫ్ బరోడా 4% పడ్డాయి.
నష్టాలు ఎందుకంటే..
ఆగస్టులో కీలక రంగాల వృద్ధి 0.5% డౌన్
సెప్టెంబర్‌లో తయారీ రంగం వృద్ధి సూచీ 51.4గా నమోదైంది. ఆగస్టుతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు
వాహన విక్రయాలు సెప్టెంబర్‌లోనూ నిరుత్సాహకరంగానే ఉన్నాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు పతనమై 71.09కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment