భారీగా తరలిపోతున్న సంపద
ముంబై : భారతీయులు రికార్డు స్థాయిలో నగదును విదేశాలకు తరలించారట. దాదాపు 460 కోట్ల డాలర్లను విదేశాలకు తరలించారని గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే గతేడాది ఈ మొత్తం 160కోట్ల డాలర్లేనట. సరళీకరణ చెల్లింపుల పథకం(ఎల్ఆర్ఎస్) ప్రకారం ఒక ఏడాదిలో 2 లక్షల 50వేల డాలర్లను ఒక వ్యక్తి విదేశాలకు తరలించుకోవచ్చు. అయితే 2013 సెప్టెంబర్ వరకూ తక్కువగా ఉన్న ఈ చెల్లింపుల పరిమితి, 2015 మే నుంచి 2 లక్షల 50వేల డాలర్లకు పెంచడంతో ఒక్కసారిగా విదేశాలకు రెమిటెన్స్ పెరిగాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గిఫ్టీ రూపంలో, బంధువుల సంరక్షణ కోసం, విదేశాల్లో పెట్టుబడుల నిమిత్తం, ఏదైనా ఆస్తిని విదేశాల్లో కొనుగోలు వంటి రూపాల్లో భారతీయులు తమ నగదును విదేశాలకు తరలిస్తుంటారు. బంధువుల సంరక్షణ కోసం, విదేశాల్లో చదువులకు ఈ సారి ఎక్కువ మొత్తంలో నగదును విదేశాలకు పంపినట్టు తెలుస్తోంది. ఎక్కువ రెమిటెన్స్ లిమిట్, పన్నుల చట్టాలు కఠినతరం, భారత రూపాయి విలువ పడిపోవడం వంటివి విదేశాలకు నగదు తరలింపుకు దారితీశాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. బంధువుల సంరక్షణకు, విదేశాల్లో చదువుకు మే 2015 నుంచి ఎల్ఆర్ఎస్ ను విస్తృతపరిచి ఎక్కువ మొత్తానికి అనుమతించడంతో ఈ మొత్తం పెరిగిందని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.