
సాక్షి, లక్నో: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానం ఒకటి భారీ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకుంది. పైలట్ అప్రమత్త కారణంగా ఇండిగో విమానం ప్రమాదం నుంచి బయటపడింది. లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. లక్నో చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇండిగో 6ఈ-685 విమానంలో ఒక ఇంజీన్ విఫలమైంది. విమానం బయలుదేరుతున్న సమయంలో ఈ విషయాన్ని గమనించిన పైలట్ టేక్‌ఆఫ్‌ని నిలిపివేసి అధికారులను అప్రమత్తం చేశారు. అయితే ఈ విషయాన్ని ప్రయాణికులకు తెలపకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రన్‌వైపై విమానాన్ని నిలిపి వేయడంతో విమానంలో విపరీతమైన వేడి, ఉక్కపోతతో అల్లాడిపోయారు. దీంతో కొంతమంది ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. మరోవైపు ఇంజన్‌లో లోపాన్ని సరిచేయడానికి ఇండిగో ఇంజనీర్ల బృందం ప్రయత్నిస్తోంది.