
కోల్‌కతా: బెంగళూరు నుంచి కోల్‌కతా వచ్చిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కోల్‌కతాకు చేరుకుని ల్యాండింగ్‌కు సిద్ధమైన సమయంలో అప్రోచ్ ఫన్నెల్ నుంచి విమానం కాక్‌పిట్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు లేజర్ లైట్ వేశారు. ఈ కిరణాలు పైలట్ కళ్లలో పడ్డాయి. ఈ నెల 23న రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాసేపట్లో ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన ఆపరేషన్ చేస్తున్న సమయంలో పైలట్ కళ్లలో లేజర్ లైట్ పడటంతో అతడి కళ్లు కాసేపు కనిపించలేదు. దీంతో విమానం రన్ వే వైపు నిమిషానికి 1500 నుంచి 2000 అడుగుల వేగంతో కిందకు దూసుకువచ్చింది. ఈ సమయంలో విమానంలో 165 మంది ప్యాసింజర్లతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. చివరకు విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రోటోకాల్ ప్రకారం ఇలాంటి ఘటనలు జరిగినపుడు విమానాన్ని ల్యాండ్ చేయకుండా మళ్లీ ఆకాశంలోకి తీసుకెళ్లి చక్కర్లు కొట్టాల్సి ఉంటుంది. ఈ ఘటనపై ఇండిగో సంస్థతో పాటు నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టేక్‌ఆఫ్, ల్యాండింగ్ సమయాల్లో పైలట్ల దృష్టి మరలితే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి.. గూడ్సు రైలు కలకలం.. డ్రైవర్ లేకుండానే ముందుకు వెళ్లి