‘మార్పు’ను పరిశ్రమలే గుర్తిస్తాయి
* మోదీ సర్కారుపై విమర్శలను తోసిపుచ్చిన నిర్మలా సీతారామన్
* కీలక సంస్కరణ బిల్లులపై విపక్షాలు సహకరించాలని వినతి
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కారు వచ్చాక ఆర్థికపరంగా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. త్వరలోనే పారిశ్రామిక వర్గాలు ఈ మార్పుల గురించి చెప్పడం మొదలుపెడతాయని భావిస్తున్నట్లు శుక్రవారమిక్కడ ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. మోదీ సర్కారు తొమ్మిది నెలల పాలనలో పరిశ్రమకు చెప్పుకోదగ్గ సానుకూల మార్పులేవీ కనబడటం లేదని,
ఇంకా నిరాశావాదం, అసంతృప్తి రాజ్యమేలుతోందని ప్రముఖ బ్యాంకర్ దీపక్ పరేఖ్ విమర్శలు గుప్పించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వం మరీ వేగంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని కూడా కార్పొరేట్లు జీర్ణించుకోలేకపోతున్నారని.. అందుకే ఈ విమర్శలంటూ పరేఖ్ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం తీవ్రంగా స్పందించడం విదితమే. మరోపక్క, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అయితే మరో అడుగు ముందుకేసి.. పరేఖ్ వ్యాఖ్యల వెనుక వ్యక్తిగత కారణాలేవైనా ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాగా, యూపీఏ ప్రభుత్వ పాలనలోని విధానపరమైన జడత్వాన్ని కూడా పరేఖ్ అప్పట్లో తీవ్రంగా ఎండగట్టడం విశేషం.
పదేళ్ల జాడ్యాన్ని పది నెలల్లో తొలగించలేం...
పదేళ్ల పాటు యూపీఏ సర్కారు హయాంలో నెలకొన్న అలసత్వాన్ని అన్నిపక్షాల నుంచి సమిష్టి కృషి ఉంటేతప్ప, కేవలం పది నెలల్లో తొలగించడం సాధ్యం కాదని... పరేఖ్ పేరును ప్రస్తావించకుండా సీతారామన్ వ్యాఖ్యానించారు.