
రిటైల్ ద్రవ్యోల్బణం13 నెలల కనిష్టానికి
♦ సెప్టెంబర్‌లో 4.41%
♦ కూరగాయల ధరల తగ్గుదల ప్రభావం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 13 నెలల కనిష్టానికి దిగొచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో 5.05 శాతంగా ఉన్న వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత నెలలో 4.41 శాతానికి తగ్గింది. కూరగాయల ధరలు తగ్గడమే సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడానికి ప్రధాన కారణం. వడ్డీరేట్ల నిర్ణయంలో రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను కీలకంగా ఆర్‌బీఐ పరిగణిస్తుందని, రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడంతో ప్రతికూల వృద్ధిలో ఉన్న పారిశ్రామిక రంగానికి జోష్ నివ్వడానికి డిసెంబర్‌లో ఆర్‌బీఐ కీలక రేట్లలో కోత విధించడానికి అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా కట్టడి చేయాలని ఆర్‌బీఐ లక్ష్యంగా నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. ఈ నెల మొదట్లోనే ఆర్‌బీఐ రెపో రేటులో పావు శాతం కోత విధించి 6.25 శాతానికి తగ్గించింది.
ఆగస్టులో 5.91 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో 3.88 శాతానికి తగ్గిపోయింది. అలాగే కూరగాయల ద్రవ్యోల్బణం 1.02 శాతం నుంచి మైనస్ 7.21 శాతానికి పడిపోయింది. గత నెలలో పప్పుధాన్యాలు, గుడ్ల ధరలు తగ్గాయి. చేపలు, మాంసం ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో స్వల్పంగా తగ్గి 5.83 శాతానికి తగ్గింది. అయితే పండ్ల ధరలు పెరిగాయి. ఈ ఏడాది ఆగస్టులో 4.22 శాతంగా ఉన్న పట్టణ ప్రాంత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 3.64 శాతానికి, అలాగే గ్రామీణ ప్రాంత రిటైల్ ద్రవ్యోల్బణం 5.87 శాతం నుంచి 4.96 శాతానికి తగ్గాయి. కాగా గతంలో రిటైల్ ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయి రికార్డ్ గత ఏడాది ఆగస్టులో 3.74 శాతంగా నమోదైంది.
ఈ ఏడాది జీడీపీ వృద్ధి 7.9 శాతం: క్రిసిల్
వర్షాలు బాగా కురవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు పెరుగుతాయని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ వినియోగం 90 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5 శాతంగా, జీడీపీ 7.9 శాతంగా ఉండగలదని క్రిసిల్ అంచనా వేస్తోంది.