న్యూఢిల్లీ: జూన్ నెలలో రిటైల్ ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం మరోసారి 5 శాతం మార్కును నమోదు చేసింది. ఈ ఏడాది జనవరిలో 5.07 శాతంగా నమోదైన తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం తిరిగి మరోసారి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆహారోత్పత్తుల విభాగంలో ధరలు కాస్తంత ఉపశమించినా, చమురు ధరలు పెరిగిపోయే సరికి ఆ ప్రభావం రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రతిఫలించింది. దీంతో 5 శాతానికి పెరిగింది. ఇది మే నెలలో 4.87 శాతంగా ఉంది. 2017 జూన్ నెలలో 1.46 శాతంగా ఉండడం గమనార్హం. ఈ మేరకు రిటైల్ ద్రవ్యోల్బణం వివరాలను కేంద్ర గణాంకాల విభాగం (సీఎస్‌వో) గురువారం విడుదల చేసింది.
ముఖ్య గణాంకాలు...
ఆహార ఉత్పత్తుల విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో ఉన్న 3.1% నుంచి జూన్‌లో 2.91 శాతానికి తగ్గుముఖం పట్టింది.
చమురు బాస్కెట్‌లో ద్రవ్యోల్బణం మే నెలతో పోలిస్తే 5.8% నుంచి 7.14 శాతానికి ఎగిసింది.
వస్త్రాలు, పాదరక్షల విభాగంలో ద్రవ్యోల్బణం 5.67 శాతంగా, హౌసింగ్ విభాగంలో 8.45 శాతంగా నమోదైంది. మేతో పోలిస్తే పెరిగాయి.
ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో పరిమితం చేసేలా చూడాలని కేంద్ర సర్కారు ఆర్‌బీఐ ముందు లక్ష్యాన్ని ఉంచిన విషయం తెలిసిందే. ఈ నెల 30 నుంచి జరిగే ఆర్‌బీఐ తదుపరి ద్వైమాసిక మానిటరీ పాలసీ సమీక్షలో రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు కీలకంగా వ్యవహరించనున్నాయి. ఆగస్ట్ 1న పాలసీ నిర్ణయాలను ఎంపీసీ ప్రకటిస్తుంది.
ఇకపై తగ్గుతుంది
‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ రిటైల్ ద్రవ్యోల్బణమే గరిష్టంగా నమోదైంది. అయితే, తర్వాతి నెలల్లో ఇది సగటున 4.5 శాతానికి తగ్గుముఖం పడుతుంది. ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగినందున ఆర్‌బీఐ దాన్ని అదుపు చేయవచ్చు’’.
– శుభదా రావుయస్ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త
Comments
Please login to add a commentAdd a comment