
వేతన పెంపు జూలై నుంచి..: ఇన్ఫీ
న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తాజాగా ఉద్యోగుల వేతన పెంపును జూలైకి వాయిదా వేసింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ విషయంలో జీతాల పెంపు మరింత ఆలస్యం కావొచ్చని తెలిపింది. కంపెనీ అమెరికా వంటి కీలక మార్కెట్లలో వీసా సంబంధిత సమస్యలను ఎదుర్కోవడం సహా పలు ప్రతికూల పరిస్థితులతో సతమతమౌతుండటం దీనికి కారణంగా కనిపిస్తోంది. ఇన్ఫోసిస్ సాధారణంగా ఏప్రిల్ నుంచి ఇంక్రిమెంట్లను ఇవ్వడం ప్రారంభిస్తుంది.
ఈ ఏడాది మాత్రం వేతన పెంపును తర్వాతి త్రైమాసికం అంటే జూలైకి వాయిదా వేసింది. ఇన్ఫోసిస్‌లో రెండు లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. జాబ్ లెవెల్ 5, దీని కన్నా దిగువ స్థాయి ఉద్యోగులకు వేతన సమీక్ష జులై నుంచి ఉంటుందని ఇన్ఫోసిస్ సీఓఓ యూబీ ప్రవీణ్ రావు ఉద్యోగులకు రాసిన ఈ–మెయిల్‌లో తెలిపారు. ఇతర స్థాయిల్లోని ఉద్యోగులకు వేతన సమీక్ష తర్వాతి త్రైమాసికాల నుంచి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగాల కోత అంశాన్ని ప్రస్తావిస్తూ.. పనితీరు ఆధారంగా తొలగింపు ఉంటుందని తెలిపారు.
భారీ ఉద్వాసనలు ఉండవు..: నాస్కామ్
నాస్కామ్ ఉద్యోగాల తొలగింపు భయాలను తగ్గించడానికి ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ ప్రయత్నిస్తోంది. పరిశ్రమలో భారీ ఉద్యోగాల కోత ఉండదని పేర్కొంది. ఉద్యోగుల పునర్‌వ్యవస్థీకరణ అనేది సర్వసాధారణమని, ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుందని తెలిపింది. అధిక సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు వార్తలు తప్పని పేర్కొంది. పనితీరు మదింపు ప్రక్రియలు కంపెనీల్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని తెలిపింది.