
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త సీఈవో సలిల్ పరేఖ్ వార్షికంగా రూ.18.6 కోట్ల మేర జీతభత్యాలు అందుకోబోతున్నారు. సంస్థ ప్రతిపాదన ప్రకారం.. ఇందులో స్థిరమైన వార్షిక వేతనం రూ.6.5 కోట్లు కాగా, మిగతాది పనితీరు ఆధారితంగా (వేరియబుల్) ఉండనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ నుంచి ఈ ప్యాకేజీ అమలవుతుంది. ఈ లోగా తొలి మూడు నెలలకు గాను రూ.2.37 కోట్ల మేర ‘వేరియబుల్ పే’ని ఇన్ఫీ ఇవ్వనుంది. పరేఖ్ పదవీకాలంలో వివిధ దశల్లో రూ.3.25 కోట్ల మేర షేర్లను కొన్ని షరతులకు లోబడి కంపెనీ కేటాయిస్తుంది. అలాగే, రూ.9.75 కోట్ల మేర ఈక్విటీ గ్రాంట్ (ఒక్క దఫా), రూ.13 కోట్ల మేర వార్షిక పనితీరు ఆధారిత ఈక్విటీ గ్రాంట్స్ లభిస్తాయి.
ఇన్ఫోసిస్ ఇందుకు సంబంధించి రూపొందించిన ప్రతిపాదనకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకోనుంది. పరేఖ్‌ను అయిదేళ్ల పాటు సీఈవోగా కొనసాగించడం, యూబీ ప్రవీణ్ రావుకు మళ్లీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గాను.. హోల్‌టైమ్ డైరెక్టర్‌గాను తిరిగి బాధ్యతలు అప్పగించడం తదితర అంశాలు ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. పోటీ కంపెనీలు విప్రో సీఈవో ఆబిదాలి నీముచ్‌వాలా వార్షికంగా రూ.13.2 కోట్లు, టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ రూ.6.22 కోట్లు అందుకుంటున్నారు.ఇన్ఫీకి ప్రమోటర్లు కాకుండా తొలిసారి సీఈవోగా వ్యవహరించిన బయటి వ్యక్తి విశాల్ సిక్కా కాగా... ఆయన 2016–17లో మొత్తం రూ.45.11 కోట్ల ప్యాకేజీ (బోనస్, స్టాక్స్ మొదలైనవన్నీ కలిపి) అందుకున్నారు. వ్యవస్థాపకులతో విభేదాల నేపథ్యంలో ఆయన తప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment