ఇన్ఫీ గైడెన్స్‌ మళ్లీ తగ్గింది! | Infosys share price: Infosys' guidance remains buoyant: 10 top takeaways from Q3 earnings | Sakshi
Sakshi News home page

ఇన్ఫీ గైడెన్స్‌ మళ్లీ తగ్గింది!

Published Sat, Jan 14 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

ఇన్ఫీ గైడెన్స్‌ మళ్లీ తగ్గింది!

ఇన్ఫీ గైడెన్స్‌ మళ్లీ తగ్గింది!

2016–17 పూర్తి ఏడాదికి అదాయ అంచనాల్లో కోత
క్యూ3 లాభం రూ.3,708 కోట్లు; 7% వృద్ధి
ఆదాయం 8.6% అప్‌; రూ.17,273 కోట్లు
 

బెంగళూరు: దేశీ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఫలితాలు ఆకట్టుకున్నప్పటికీ.. ఆదాయ అంచనాలు(గైడెన్స్‌) మాత్రం నిరుత్సాహపరిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2016–17, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేషన్‌ నికర లాభం రూ.3,708 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,465 కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధి చెందింది. ఇక ఆదాయం రూ.15,902 కోట్ల నుంచి రూ.17,273 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది క్యూ3తో పోలిస్తే 8.6 శాతం పెరిగింది.

సీక్వెన్షియల్‌గా మిశ్రమ ధోరణి...
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)తో పోలిస్తే సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన నికర లాభం 2.8 శాతం వృద్ధి చెందింది. ఆదాయం మాత్రం 0.2 శాతం తగ్గింది. ఇక డాలరు రూపంలో చూస్తే సీక్వెన్షియల్‌గా ఆదాయం 1.4% దిగజారి క్యూ3లో 2.53 బిలియన్‌ డాలర్లను తాకింది. గడిచిన ఏడు క్వార్టర్లలో డాలరు ఆదాయం తగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సీజనల్‌గా బలహీన క్వార్టర్‌ కావడంతోపాటు ఆర్‌బీఎస్‌ డీల్‌ రద్దు కావడం కూడా ఫలితాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. అమెరికా, యూరప్‌లలో పనిదినాలు తక్కువగా ఉండటంతో సాధారణంగా భారత ఐటీ కంపెనీల పనితీరు డిసెంబర్‌ క్వార్టర్‌లో కాస్త బలహీనంగా ఉంటుంది. కాగా, క్యూ3లో ఇన్ఫోసిస్‌ నికర లాభం రూ.3,569 కోట్లు, ఆదాయం రూ.17,313 కోట్లుగా ఉండొచ్చని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేశారు.

గైడెన్స్‌ ప్చ్‌...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఇన్ఫోసిస్‌ ఆదాయ అంచనా(గైడెన్స్‌)లను మళ్లీ తగ్గించింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి అంతక్రితం 8–9 శాతంగా అంచనా వేయగా ఇప్పుడు దీన్ని 8.4–8.8 శాతానికి సవరించింది. దీని ప్రకారం చూస్తే.. డాలర్ల రూపంలో గైడెన్స్‌ 7.5–8.5% నుంచి 7.2–7.6 శాతానికి తగ్గినట్లు లెక్క. ఇక రూపాయిల్లో ఆదాయ గైడెన్స్‌ కూడా 10.9–11.9 శాతం నుంచి 10–10.4 శాతానికి తగ్గింది. గత తొమ్మిది నెలల్లో ఇన్ఫోసిస్‌ గైడెన్స్‌ను తగ్గించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
అక్టోబర్‌–డిసెంబర్‌ వ్యవధిలో ఇన్ఫీ కొత్తగా 77 క్లయింట్లను జతచేసుకుంది. ఇందులో 75 మిలియన్‌ డాలర్ల ఆదాయ విభాగంలో రెండు కాంట్రాక్టులు ఉన్నాయి.
క్యూ3లో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ వ్యాపార సీక్వెన్షియల్‌గా 0.8 శాతం దిగజారింది. అయితే, ఆర్‌బీఎస్‌ కాంట్రాక్టు రద్దయినప్పటికీ స్థిర కరెన్సీ(డాలరుతో రూపాయి మారకం విలువ) ప్రాతిపదికన 0.2 శాతం వృద్ధి చెందింది.
ప్రాంతాలవారీగా చూస్తే... ఉత్తర అమెరికా వ్యాపారం సీక్వెన్షియల్‌గా 0.6%, యూరప్‌ వ్యాపారం 2.5 శాతం చొప్పన తగ్గాయి. భారత్‌లో వ్యాపారం1% తగ్గింది. మిగతా దేశాలకు చెందిన వ్యాపారంలోనూ 3.2 శాతం తగ్గుదల నమోదైంది.
2016 డిసెంబర్‌ చివరినాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,99,763కు చేరింది. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,99,829గా ఉంది. అంటే నికర నియామకాలు 66 తగ్గాయి. 2015 డిసెంబర్‌ చివరినాటికి ఇన్ఫీ మొత్తం సిబ్బంది సంఖ్య 1,93,383. క్యూ3లో ఉద్యోగుల వలసలు(అట్రిషన్‌ రేటు) కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 1.6 శాతం(సీక్వెన్షియల్‌గా) తగ్గింది. 20 శాతం నుంచి 18.4 శాతానికి చేరింది.
ఇక ఇదే నెలాఖరుకు ఇన్ఫీ వద్దనున్న మొత్తం నగదు, తత్సంబంధ నిల్వలు రూ.35,697 కోట్లకు చేరాయి.
గైడెన్స్‌ తగ్గింపు ప్రభావంతో శుక్రవారం ఇన్ఫోసిస్‌ షేరు ధర శుక్రవారం బీఎస్‌ఈలో 2.5 శాతం దిగజారింది. రూ.975 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ ఒక్కరోజులో రూ.5,718 కోట్లు దిగజారి రూ. 2,23,987 కోట్లకు చేరింది.

2016 క్యాలెండర్‌ ఏడాదిలో ఇన్ఫీ 10 బిలియన్‌ డాలర్ల ఆదాయ మైలురాయిని అధిగమించడం చాలా ఆనందం కలిగిస్తోంది. మానసికంగా, భావోద్వేగపరంగా ఇది మాకు చాలా కీలకమైన మైలురాయి. అయితే, 2020కల్లా మార్జిన్ల స్థాయిని 30 శాతానికి పెంచుకోవడం, 20 బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయ లక్ష్యాన్ని సాధించడమే లక్ష్యంగా మేం ముందుకెళ్తున్నాం. సీజనల్‌గా బలహీన ధోరణి, ఆర్‌బీఐ కాంట్రాక్టు రద్దు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. క్యూ3లో మేం మెరుగైన పనితీరునే నమోదు చేశాం. మార్జిన్లు కూడా మెరుగయ్యాయి. క్యూ4పై ఆశాజనకంగా ఉన్నాం. ఇక ఒక్క ఇంధన రంగం మినహా వచ్చే ఏడాది చాలా రంగాలకు సంబంధించి మా వ్యాపారం మళ్లీ పుంజుకుంటుందని భావిస్తున్నాం. మొత్తంమీద చూస్తే గడిచిన తొమ్మిది నెలల్లో కంపెనీ పనితీరు సంతృప్తికరంగానే ఉంది.
– విశాల్‌ సిక్కా, ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ

ట్రంప్‌ విధానాలు సానుకూలంగానే..!
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉద్యోగ వీసాలను భారీగా తగ్గించేస్తారన్న అంచనాలపై ఇన్ఫీ చీఫ్‌ విశాల్‌ సిక్కా మాట్లాడుతూ.. తమ క్లయింట్ల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఆందోళనలూ వ్యక్తం కాలేదని చెప్పారు. ట్రంప్‌ ప్రభుత్వం వ్యాపారాలకు స్నేహపూర్వకంగానే ఉంటుం దని, అదేవిధంగా ఎంట్రప్రెన్యూర్‌షిప్, నవకల్పనలను ప్రోత్సహిస్తుందనే భావిస్తున్నట్లు సిక్కా పేర్కొన్నారు. అయితే, అమెరికాలో వీసా, వలసలకు సంబంధించిన విధానాలు మారొచ్చని... ఏం జరుగుతుందనేది వేచిచూడాల్సి ఉందని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement