ఇన్ఫీ ‘గెడైన్స్’ షాక్! | Infosys downgrades guidance for current fiscal; share price drops by 10% | Sakshi
Sakshi News home page

ఇన్ఫీ ‘గెడైన్స్’ షాక్!

Published Sat, Jul 16 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

ఇన్ఫీ ‘గెడైన్స్’ షాక్!

ఇన్ఫీ ‘గెడైన్స్’ షాక్!

ఈ ఏడాది ఆదాయవృద్ధి అంచనాల్లో కోత...
డాలర్ గెడైన్స్ 13.5 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు...
క్యూ1లో నికర లాభం 3,436 కోట్లు; 13 శాతం వృద్ధి
ఆదాయం 17 శాతం అప్; రూ.16,782 కోట్లు  షేరు 11 శాతం క్రాష్...

బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. డాలర్ల రూపంలో అంతక్రితం ఆదాయ వృద్ధి గెడైన్స్‌ను 11.5-13.5 శాతంగా పేర్కొనగా.. దీన్ని ఇప్పుడు 10.5-12 శాతానికి పరిమితం చేసింది. ప్రధానంగా కరెన్సీ విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గులను ఇందుకు కారణంగా పేర్కొంది. మరోపక్క, తొలి త్రైమాసిక ఫలితాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ పరిణామాల కారణంగా శుక్రవారం ఇంట్రాడేలో ఇన్ఫీషేరు 11 శాతం మేర క్రాష్ అయింది.

 ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం(2016-17, క్యూ1)లో ఇన్ఫీ రూ. 3,436 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,030 కోట్లతో పోలిస్తే 13.4 శాతం వృద్ధి చెందింది. ఇక ఆదాయం 16.9 శాతం వృద్ధితో రూ. 16,782 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ. 14,354 కోట్లుగా ఉంది. కాగా, డాలర్ల రూపంలో నికర లాభం 7.4 శాతం వృద్ధి చెంది 51.1 కోట్ల డాలర్లకు, ఆదాయం 10.9 శాతం వృద్ధితో 2.5 బిలియన్ డాలర్లకు పెరిగింది.

 సీక్వెన్షియల్‌గా లాభం డౌన్...

 గతేడాది ఆఖరి త్రైమాసికం(క్యూ4)లో లాభం రూ.3,597 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్ ప్రాతిపదికన) ఇన్ఫీ లాభం క్యూ1లో 4.5 శాతం దిగజారింది. ఆదాయం కూడా రూ.16,550 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 1.4 శాతం మాత్రమే పెరిగింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ1లో ఇన్ఫోసిస్ రూ.3,447 కోట్ల నికర లాభాన్ని, రూ. 17,089 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. కాగా, రూపాయి ప్రాతిపదికన చూస్తే... ఈ ఏడాది ఆదాయం వృద్ధి అంచనాలను ఇన్ఫీ స్వల్పంగా 13.7-15.21 శాతానికి(జూన్ 30 నాటి డాలరుతో రూపాయి మారకం విలువ 67.53 ప్రకారం) పెంచడం గమనార్హం. అంతక్రితం ఈ గెడైన్స్‌ను 12.7-14.7 శాతంగా(మార్చి 31 నాటి రూపాయి విలువ 66.26 ప్రకారం) పేర్కొంది. ‘ప్రపంచంలో ప్రధాన కరెన్సీ విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గులు తీవ్ర ప్రభావం చూపినప్పటికీ.. మేం అనుసరిస్తున్న వ్యయ నియంత్రణ చర్యలు క్యూ1లో తోడ్పాటును అందించింది’ అని కంపెనీ సీఎఫ్‌ఓ ఎం.డి. రంగనాథ్ పేర్కొన్నారు.

 ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...

క్యూ1లో ఇన్ఫోసిస్ కొత్తగా 34 కాంట్రాక్టులను దక్కించుకుంది. 10 కోట్ల డాలర్ల విభాగంలో 3 కాంట్రాక్టులు ఉన్నాయి.

జూన్ క్వార్టర్‌లో స్థూలంగా 13,268 మంది ఉద్యోగులను నియమించుకుంది. 10,262 మంది వలసపోవడంతో(అట్రిషన్) నికర నియామకాలు 3,006కు పరిమితమయ్యాయి.

మరోపక్క, క్యూ1లో అట్రిషన్ రేటు ఏకంగా 21%కి ఎగబాకింది. క్రితం ఏడాది క్యూ1లో అట్రిషన్ రేటు 19.2% కాగా, గడిచిన త్రైమాసికం(క్యూ4)లో 17.3 శాతంగా నమోదైంది.

జూన్ చివరినాటికి ఇన్ఫోసిస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.97 లక్షలకు చేరింది.

నిరుత్సాహకరమైన ఫలితాలు, గెడైన్స్ కోతతో కంపెనీ షేరు కుప్పకూలింది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో ఒకానొక దశలో 11 శాతం మేర క్షీణించి రూ.1,052 కనిష్టాన్ని తాకింది. చివరకు 8.85 శాతం నష్టపోయి రూ.1,072 వద్ద స్థిరపడింది.

‘కన్సల్టింగ్ సేవలు, ప్యాకేజ్‌ల అమలుకు సంబంధించి క్లయింట్ల వ్యయంలో అనుకోని ప్రతికూలతలు క్యూ1లో అంచనాలకంటే వృద్ధి తగ్గడానికి కారణమైంది. మరోపక్క, గడిచిన త్రైమాసికాల్లో మేం దక్కించుకున్న భారీ కాంట్రాక్టుల అమలు మందకొడిగా సాగడం కూడా ప్రభావం చూపింది. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగిన(బ్రెగ్జిట్) ప్రభావాన్ని ఈ ఏడాది గెడైన్స్‌లో మేం పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుత మార్కెట్‌పై మా సొంత అంచనాల మేరకు తాజా గెడైన్స్ ఇచ్చాం. ప్రధానంగా కన్సల్టింగ్‌లో క్లయింట్ల వ్యయాల్లో తగ్గుదల, ప్రపంచవ్యాప్తంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి కారణంగానే డాలర్ గెడైన్స్‌ను తగ్గించాం’.   - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement