మరోసారి షాకివ్వబోతున్న ఇన్ఫోసిస్
మరోసారి షాకివ్వబోతున్న ఇన్ఫోసిస్
Published Fri, Sep 16 2016 8:56 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
సాప్ట్వేర్ సేవల రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ మళ్లీ గైడెన్సు షాకివ్వబోతోంది. రెవెన్యూ గైడెన్స్ను తగ్గించే అవకాశాలు ఉన్నాయంటూ జేపీ మోర్గాన్ ఇండియా ఇన్వెస్టర్ల సమావేశంలో కంపెనీ సీఈవో విశాల్ సిక్కా వెల్లడించారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో సవాళ్లు, ప్రాజెక్టుల రద్దు తదితర కారణాలు గైడెన్స్ కోతకు దోహదం చేయొచ్చని తెలిపారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ సంచలన నిర్ణయం తీసుకోవడంతో కంపెనీ ఆదాయ అంచనాలు తారుమారు అవుతూ ఈ నష్టాలను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. కాగ, ఇన్ఫోసిస్ తన గైడెన్సు తగ్గించుకోవడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రెండోసారి. కన్సల్టింగ్లో క్లయింట్ల వ్యయాల్లో తగ్గుదల, ప్రపంచ వ్యాప్తంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చిత కారణంగా మొదటి క్వార్టర్ ఫలితాల ప్రకటన సమయంలో ఇన్ఫోసిస్ తన డాలర్ గైడెన్సును తగ్గించి 10.5-12 శాతానికి పరిమితం చేసిన సంగతి తెలిసిందే.
అనంతరం మళ్లీ తన ఆదాయ వృద్ధి గైడెన్స్ను మరోమారు తగ్గించే అవకాశాలున్నట్టు విశాల్ సిక్కా పేర్కొన్నారు. అయితే ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే, జూలై-సెప్టెంబర్లో మెరుగైన ప్రదర్శనను కనబరుస్తామని విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. క్యూ1 వృద్ధి కంటే క్యూ2 వృద్ధి బాగుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. గైడెన్సు తగ్గింపుకు ప్రధాన కారణంగా అంతర్జాతీయంగా ఎదుర్కోబోతున్న సవాళ్లేనని తెలిపారు. క్యూ2 ప్రారంభంలోనే కంపెనీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని, ఇన్ఫోసిస్కు కేటాయించిన ప్రాజెక్టును రాయల్ బ్యాంకు ఆఫ్ స్కాట్లాండ్ రద్దు చేసుకోవడం కంపెనీ ఆదాయాలకు గండికొడుతుందని విశాల్ సిక్కా వివరించారు.
ఈ ప్రాజెక్టు రద్దుతో 3వేల ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారండంతో పాటు, 40 మిలియన్ డాలర్ల రెవెన్యూలకు కూడా ప్రమాదం వాటిల్లనుందని మార్కెట్ విశ్లేషకులు ముందుగానే అంచనావేశారు. ఈ నష్టం కంపెనీ గైడెన్సు తగ్గించుకునేందుకు దారితీస్తుందని కూడా వెల్లడించారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే మరోమారు గైడెన్స్ కోత పెట్టే అవకాశాలున్నట్టు సీఈవో తెలపడం గమనార్హం. కొన్ని అంతర్గత వ్యవహారాలు కంపెనీ తొలి క్వార్టర్ ఆదాయాలపై ప్రభావం చూపినప్పటికీ, ప్రస్తుతం అవి పరిష్కారమైనట్టు సిక్కా తెలిపారు. అక్టోబర్లో కంపెనీ ఇన్ఫోసిస్ తన రెండో క్వార్టర్(జూలై-సెప్టెంబర్) ఫలితాలను విడుదలచేయనుంది. గైడెన్సు తగ్గించే అవకాశాలున్నట్టు విశాల్ సిక్కా తెలుపడంతో, మార్కెట్లో మళ్లీ ఇన్ఫోసిస్ షేరు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నట్టు మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
Advertisement
Advertisement