వృద్ధి గైడెన్స్‌కి కట్టుబడి ఉన్నాం: ఇన్ఫోసిస్
న్యూఢిల్లీ: ప్రాజెక్టులను కొనసాగించేందుకు కొంత మంది క్లయింట్లు భారీ డిస్కౌంట్లు అడుగుతున్నప్పటికీ.. ఈ ఏడాది ఆదాయ వృద్ధికి సంబంధించి ఇచ్చిన 6–5–8.5 శాతం గైడెన్స్‌కి కట్టుబడి ఉన్నామని ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. ఐటీ బడ్జెట్ పూర్వ స్థాయిల్లోనే కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని సంస్థలు 3–5 ఏళ్ల రెన్యువల్ డీల్స్ విషయంలో 30–40 శాతం తక్కువకే ప్రాజెక్టులు చేయాలని కోరవచ్చని సంస్థ సీవోవో యూబీ ప్రవీణ్ రావు చెప్పారు.
తద్వారా మిగిలే నిధులను వేరేవాటిపై ఇన్వెస్ట్ చేయాలని క్లయింట్లు భావిస్తున్నారని మోర్గాన్ స్టాన్లీ నిర్వహించిన 19వ భారత వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ఇక మరికొన్ని కంపెనీలు కొత్త టెక్నాలజీలను ఆకళింపు చేసుకుని, ఇన్వెస్ట్ చేసేందుకు సమయం తీసుకోవచ్చని రావు చెప్పారు. డీల్స్ పరిమాణం తక్కువ కావడానికి ఇలాంటి అంశాలే కారణమన్నారు.