ఇన్ఫీ లాభం అప్.. గైడెన్స్ డౌన్ | Infosys reports 4.95% QoQ jump in net profit, lowers FY17 revenue guidance to 8-9% | Sakshi
Sakshi News home page

ఇన్ఫీ లాభం అప్.. గైడెన్స్ డౌన్

Published Sat, Oct 15 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

ఇన్ఫీ లాభం అప్.. గైడెన్స్ డౌన్

ఇన్ఫీ లాభం అప్.. గైడెన్స్ డౌన్

క్యూ2లో అంచనాలు మించిన లాభం
రూ. 3,606 కోట్లు; 6.1 శాతం వృద్ధి
ఆదాయం రూ.17,310 కోట్లు; 10.7% వృద్ధి
ఈ ఏడాది ఆదాయ వృద్ధి అంచనాలు 8-9 శాతానికి కుదింపు
షేరుకి రూ.11 చొప్పున మధ్యంతర డివిడెండ్

బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు ‘కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం’ అన్న రీతిలో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో కంపెనీ నికర లాభం ఇన్వెస్టర్ల అంచనాలను మించినప్పటికీ.. పూర్తి ఏడాదికి ఆదాయ వృద్ధి అంచనాల్లో భారీగా కోత పడింది. ప్రధానంగా అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితిని ఇందుకు కారణంగా పేర్కొంది. క్యూ2లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,606 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,398 కోట్లతో పోలిస్తే 6.1 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం కూడా 10.7 శాతం ఎగసి రూ.17,310 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.15,635 కోట్లుగా ఉంది.

సీక్వెన్షియల్‌గానూ వృద్ధి...
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో లాభం రూ.3,436 కోట్లతో పోలిస్తే(క్యూ1, సీక్వెన్షియల్ ప్రాతిపదికన) కూ2లో 4.9 శాతం వృద్ధి చెందింది. ఆదాయం కూడా రూ.16,782 కోట్ల నుంచి 3.1 శాతం పెరిగింది. ఇక డాలరు రూపంలో ఆదాయం సీక్వెన్షియల్‌గా 3.4 శాతం వృద్ధితో 2.587 బిలియన్ డాలర్లుగా నమోదైంది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఈ వృద్ధి 3.9 శాతంగా ఉంది. అగ్రగామి టీసీఎస్‌తో పోలిస్తే(1 శాతం, 1.3 శాతం చొప్పున ఉన్నాయి) ఇన్ఫీ మెరుగైన పనితీరునే సాధించింది. కాగా, మార్కెట్ విశ్లేషకులు క్యూ2లో ఇన్ఫీ రూ.3,500 కోట్ల లాభాన్ని, రూ.17,150 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. డాలరు ఆదాయం 2.559 బిలియన్ డాలర్లు ఉండొచ్చని లెక్కగట్టారు.

గైడెన్స్  తగ్గింపు...
ప్రస్తుత పూర్తి ఏడాది(2016-17)కి ఆదాయ వృద్ధి అంచనాలను(గెడైన్స్) ఇన్ఫోసిస్ భారీగా తగ్గించి 8-9 శాతానికి పరిమితం చేసింది. అంతక్రితం గైడెన్స్ 10.5-12 శాతంగా ఉంది. ఆదాయ వృద్ధి అంచనాలను వరుసగా రెండో క్వార్టర్‌లోనూ తగ్గించడం గమనార్హం. ప్రధానంగా సమీపకాలంలో అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావంతో ద్వితీయార్ధంలో పనితీరు అంచనాలను దృష్టిలోపెట్టుకొని కంపెనీ తాజా ప్రకటన చేసింది.

ఇతర ముఖ్యాంశాలివీ...
క్యూ2లో కంపెనీ మార్జిన్లు సీక్వెన్షియల్‌గా 80 బేసిస్ పాయింట్లు ఎగబాకి 24.9 శాతంగా నమోదయ్యాయి.

జూలై-సెప్టెంబర్ కాలంలో 78 కొత్త క్లయింట్లను సంపాదించింది.

ఉత్తర అమెరికా వ్యాపారంలో సీక్వెన్షియల్‌గా 2.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. యూరప్ 3.7%, భారత్ 28.7 శాతం, మిగతా ఇతర దేశాలకు సంబంధించి వ్యాపారం 5.2% వృద్ధి చెందింది.

సెప్టెంబర్ చివరినాటికి రూ.35,640 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.

రూ. 5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.11 చొప్పున(220 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.

క్యూ2లో కంపెనీ స్థూలంగా 12,717 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 2,779 మంది వలసపోవడంతో నికర నియామకాలు 9,938గా నమోదయ్యాయి. సెప్టెంబర్ చివరినాటికి ఇన్ఫీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,99,829కు చేరింది.

ఫలితాలు అంచనాలను మించినప్పటికీ.. గెడైన్స్ తగ్గింపు కారణంగా ఇన్ఫీ షేరు దిగజారింది. శుక్రవారం బీఎస్‌ఈలో ఒకనాకొక దశలో ఏడాది కనిష్టానికి(రూ.996) పడిపోయింది కూడా. చివరికి 2.34 శాతం నష్టంతో రూ.1,027 వద్ద ముగిసింది.

ప్రధానమైన ఐటీ సర్వీసుల కాంట్రాక్టుల సమర్థ నిర్వహణపై దృష్టిసారించడం ద్వారా క్యూ2లో మంచి పనితీరును సాధించగలిగాం. అయితే, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితిలోనే మరికొన్నాళ్లు పయనించాల్సి ఉంటుంది. దీంతో గెడైన్స్‌ను సవరించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మేం ఇప్పుడు అనుసరిస్తున్న ‘సాఫ్ట్‌వేర్ ప్లస్ సర్వీసెస్’ విధాన వ్యూహాన్ని మరింత పటిష్టంగా అమలు చేయనున్నాం. 2020 నాటికి 20 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జించాలన్న లక్ష్యానికి కట్టుబడిఉన్నాం. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో మార్జిన్లు 24-25 శాతం మేర ఉండొచ్చని భావిస్తున్నాం. క్యూ2లో 1.2 బిలియన్ డాలర్ల విలువైన ఆరు భారీ కాంట్రాక్టులను దక్కించుకున్నాం. రానున్న కొద్ది క్వార్టర్లపాటు బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో ఆదాయ వృద్ధి ఉండకపోవచ్చనేది మా అంచనా. అయితే, దీర్ఘకాలానికి చూస్తే ఇబ్బందులేవీ లేనట్టే.  - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ

నాస్కామ్ ఐటీ వృద్ధి అంచనాల్లో కోత!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కారణంగా ఐటీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఏడాది దేశీ ఐటీ రంగం వృద్ధి అంచనాలను తగ్గించే అవకాశం ఉందని పరిశ్రమ చాంబర్ నాస్కా మ్ సంకేతాలిచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో దేశీ సాఫ్ట్‌వేర్ ఎగుమమతుల ఆదాయం 10-12% ఉంటుందనేది నాస్కామ్ అంచనా(గెడైన్స్). ‘ఇన్ఫీ, టీసీఎస్ మాదిరిగానే ఇతర ఐటీ కంపెనీలు కూడా అనిశ్చితిపై ఆందోళనలు వ్యక్తం చేస్తే.. ప్రస్తుత గెడైన్స్‌ను సవరించే అంశాన్ని పరిశీలించాల్సి వస్తుంది.

అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా తగ్గించాలా వద్దా... ఎంతకు చేర్చాలి అనేది చెప్పడం కష్టమే’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ పేర్కొన్నారు. మిగతా కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు కూడా వెలువడ్డాకే(ఈ నెల చివరికి లేదా నవంబర్‌లో) వృద్ధిపై నాస్కామ్ తాజా అభిప్రాయాలను వెల్లడిస్తుందని ఆయన చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement