టీడీఎస్‌ కోత వద్దా అయితే 'ఫామ్‌' ఇవ్వండి! | Interest income is 10 percent cut by 10 thousand rupees | Sakshi
Sakshi News home page

టీడీఎస్‌ కోత వద్దా అయితే 'ఫామ్‌' ఇవ్వండి!

Published Mon, Jun 25 2018 1:56 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

Interest income is 10 percent cut by 10 thousand rupees - Sakshi

పొదుపు చేసేవారిలో చాలా మంది ఆధారపడేది బ్యాంకు డిపాజిట్లపైనే. రూ.లక్షల కొద్దీ డిపాజిట్‌ చేసిన వారి వార్షిక వడ్డీ ఆదాయంపై బ్యాంకులు టీడీఎస్‌ విధిస్తుంటాయి. ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖకు అందజేస్తాయి. కొందరికి పన్ను చెల్లించేంత ఆదాయం లేకున్నా వడ్డీ రూ.10వేలు దాటితే పడుతుంటుంది. ఇలాంటి వారు సకాలంలో బ్యాంకులకు ఫామ్‌ 15జీ, 15 హెచ్‌ ఇవ్వడం ద్వారా పన్ను కోత (టీడీఎస్‌) బాధను తప్పించుకోవచ్చు. అప్పుడు బ్యాంకులు వడ్డీలో రూపాయి కూడా కోత పెట్టవు. ఆ వివరాలు చూద్దాం...      

టీడీఎస్‌ అన్నది ఎంత మొత్తం డిపాజిట్‌ చేశారన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. అంటే వార్షికంగా వడ్డీ ఆదాయం రూ.10,000 దాటిన వారికి టీడీఎస్‌ భారం ఉంటుంది. సీనియర్‌ సిటిజన్లు (60ఏళ్లు దాటిన వారు) అయితే వడ్డీ ఆదాయం రూ.50,000 వరకు టీడీఎస్‌ ఉండదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్ల వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ అమలవుతుంది. చెల్లించాల్సిన వడ్డీలో 10 శాతాన్ని పన్ను కింద బ్యాంకులు మినహాయించి మిగిలిన మొత్తాన్నే ఖాతాదార్లకు చెల్లిస్తాయి. 

పన్ను కట్టేంత ఆదాయం లేకుంటే...
ఒక ఉదాహరణ చూద్దాం. రాజారావుకు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రూపంలో ఏడాదికి రూ.2 లక్షల వరకూ వస్తుంది. తనకు ఇతరత్రా ఆదాయమేదీ లేదు. అలాగే శ్రీకర్‌కు జీతం రూపంలో వార్షికంగా రూ.10 లక్షల వరకూ వస్తుంది. అది కాకుండా బ్యాంకులోని డిపాజిట్లపై ఏడాదికి రూ.9 వేల వరకూ ఆదాయం వస్తుంది. ఆదాయపు పన్ను లెక్కల ప్రకారం శ్రీకర్‌ తన జీతానికి ఈ వడ్డీని కలిపి మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే తను ఎక్కువ పన్ను చెల్లించాలి. రాజారావుకు ఇతరత్రా ఆదాయమేదీ లేదు కనుక రూ.2 లక్షలు దాదాపు పన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటుంది. కానీ ఇక్కడ బ్యాంకులు ఏం చేస్తాయంటే రాజారావు వడ్డీపై రూ.20వేలు ఆదాయపు పన్ను కింద మినహాయిస్తాయి. శ్రీకర్‌ విషయంలో మాత్రం రూపాయి కూడా కోత కోయవు. ఎందుకంటే వాటికి వడ్డీ ఆదాయం ఎంతన్నదే ముఖ్యం. డిపాజిట్‌ చేసిన వారి వ్యక్తిగత ఆదాయంతో సంబంధం ఉండదు. అందుకే రాజారావు వంటి వ్యక్తులు బ్యాంకుకు ఫామ్‌ 15జీ, 15హెచ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు బ్యాంకులు వారి వడ్డీలో కోత పెట్టవు. వారి ఆదాయం పన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటుంది కనుక వారు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.శ్రీకర్‌లా బయట జీతం, ఇతరత్రా ఆదాయం వస్తూ... అది పన్ను మినహాయింపు పరిధిని దాటిపోయిన పక్షంలో వారు బ్యాంకుల్లో ఫామ్‌ 15జీ, 15హెచ్‌ వంటివి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వారికి పన్ను రూపేణా 10 శాతం కోత పడి, మిగిలింది మాత్రమే చేతికి వస్తుంది. ఒకవేళ వారు సైతం ఫామ్‌ 15 సమర్పించి ఉంటే... బ్యాంకులు వారికి మొత్తం వడ్డీని ఇచ్చేస్తాయి. కానీ వారు తమ ఆదాయానికి దీన్ని కూడా కలిపి, ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

ఎవరు ఏ ఫామ్‌ ఇవ్వాలంటే...
60 ఏళ్లలోపు వయసున్న వారు టీడీఎస్‌ వద్దనుకుంటే ఫామ్‌ 15జీ ఇవ్వాలి. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన వారు దీన్ని ఇచ్చేందుకు అర్హులు. ఒకవేళ సీనియర్‌ సిటిజన్లయితే ఫామ్‌ 15హెచ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ రెండూ కూడా మన దేశంలో ఉండేవారికే. ఎన్నారైలు వీటిని సమర్పించేందుకు అవకాశం లేదు. ఫామ్‌ 15జీ ఇవ్వాలనుకునే వారు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలేమిటంటే... పన్ను మినహాయింపులను తీసివేయగా మిగిలిన ఆదాయం వార్షికంగా రూ.2.5 లక్షలు దాటకూడదు. అలాగే, వడ్డీ ఆదాయం మొత్తం కూడా రూ.2.5 లక్షలు దాటకూడదు.

మరో ఉదాహరణ చూద్దాం...
శ్రీనాథ్‌కు వార్షికంగా వడ్డీ రూపేణా రూ.2.75 లక్షల ఆదాయం వస్తోంది. ఇది కాక అతని మరో రూ.1.25 లక్షలు ఇతర ఆదాయంగా సమకూరింది. మొత్తంగా ఆ సంవత్సరంలో అతని ఆదాయం రూ.4 లక్షలు. అయితే, శ్రీనాథ్‌ సెక్షన్‌ 80సీ కింద అర్హత కలిగిన సాధనాల్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేశాడు. దీంతో అతడి పన్ను వర్తించే ఆదాయం రూ.2.5 లక్షలయింది. ఇక్కడ శ్రీనాథ్‌కు ఫామ్‌ 15జీ ఇచ్చేందుకు అర్హత లేదు. పన్ను వర్తించే ఆదాయం రూ.2.5 లక్షలే కానీ... వార్షిక వడ్డీ ఆదాయం రూ.2.5 లక్షలు దాటకూడదన్న నిబంధన అతడి విషయంలో నెరవేరలేదు. వడ్డీ రూపంలో శ్రీనాథ్‌కు రూ.2.75 లక్షలొస్తోంది కనుక ఫామ్‌ 15జీ ఇవ్వడానికి కుదరదు. అయితే, సీనియర్‌ సిటిజన్లకు కాస్తంత వెసులుబాటుంది. వారు ఏదో ఒక నిబంధన నెరవేరిస్తే ఫామ్‌ 15 హెచ్‌ ఇవ్వొచ్చు. అంటే సీనియర్‌ సిటిజన్లకు వార్షికాదాయం పన్ను వర్తించేంత ఉండకుండా ఉంటే చాలు. 60–80 ఏళ్ల మధ్య ఉన్న వారికి వార్షికాదాయం రూ.3 లక్షల వరకు, 80 ఏళ్లపైన ఉన్న వారికి రూ.5 లక్షల వరకు పన్ను లేదు. ఈ లోపు వార్షికాదాయం ఉంటే ఫామ్‌ 15 హెచ్‌ ఇచ్చేందుకు అర్హత ఉన్నట్టే. వడ్డీ ఆదాయం ఈ వార్షిక ఆదాయ పరిమితి దాటి ఉన్నా ఫర్వాలేదు.

బ్యాంకులకే కాదు...
టీడీఎస్‌ విధించకుండా ఇచ్చే ఈ పత్రాలు బ్యాంకులకే పరిమితం అనుకునేరు. బాండ్లను జారీ చేసే కంపెనీలు, ఈపీఎఫ్‌వో, అద్దె ఇంట్లో ఉండి కిరాయి చెల్లించేవారు, కమీషన్‌ చెల్లించే బీమా సంస్థలకు కూడా వీటిని సమర్పించొచ్చు. 
►ఒకే బ్యాంకు పరిధిలో ఒకటికి మించిన బ్యాంకు శాఖల్లో డిపాజిట్‌ చేసి ఉంటే అన్నింటి వడ్డీ ఆదాయాన్ని లెక్కించి బ్యాంకులు టీడీఎస్‌ను అమలు చేస్తాయి. కనుక డిపాజిట్‌ ఉన్న ప్రతీ బ్యాంకు శాఖలో వడ్డీ ఆదాయం రూ.10,000 దాటుతున్నట్టయితే ఫామ్‌ 15జీ, సీనియర్‌ సిటిజన్లు రూ.50,000 దాటితే ఫామ్‌15హెచ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 
►కంపెనీ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసిన వారికి వార్షిక వడ్డీ ఆదాయం రూ.5,000 దాటితే కంపెనీలు 10 శాతం టీడీఎస్‌ను కోసేస్తాయి. 
► ఈపీఎఫ్‌ సభ్యులు ఐదేళ్ల సర్వీసు పూర్తి కాకుండానే డబ్బుల్ని వెనక్కి తీసుకున్నా 10 శాతం టీడీఎస్‌ అమలు చేస్తారు. 
►కిరాయిదారులు వార్షికంగా అద్దె రూపంలో ఇచ్చే ఆదాయం రూ.1,80,000 దాటితే వారూ అద్దె మొత్తంలో 10 శాతం టీడీఎస్‌ కింద మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సి ఉంటుంది. 
ఈ సందర్భాల్లో అర్హత కలిగిన వారు ఫామ్‌ 15జీ లేదా ఫామ్‌ 15హెచ్‌ సమర్పించడం ద్వారా పన్ను భారాన్ని తప్పించుకోవచ్చు. ఈ పత్రాల్లో పాన్‌ నంబర్‌ను పేర్కొనడం తప్పనిసరి. లేదంటే టీడీఎస్‌ కింద 20 శాతం మినహాయించడం జరుగుతుంది. ప్రస్తుతం బ్యాంకులు వీటిని ఆన్‌లైన్‌లోనూ సమర్పించే అవకాశం కల్పిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరంలో వీటిని ఎప్పుడైనా సమర్పించే వీలుంది. అయితే, పన్ను విధించకుండా వీలైనంత ముందుగానే ఇవ్వడమే మంచిదన్న విషయం గుర్తుంచుకోవాలి. వీటిని ప్రతీ ఆర్థిక సంవత్సరానికి విడిగా ఇవ్వాల్సి ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement