
దేశంలో ఇంటర్నెట్.ఆర్గ్ యూజర్లు @ 8 లక్షలు
న్యూఢిల్లీ: అందరికీ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తెచ్చే నినాదంతో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ఆవిష్కరించిన ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ యూజర్ల సంఖ్య భారత్‌లో ప్రస్తుతం 8 లక్షల స్థాయికి చేరింది. టెలికం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ఆంధ్రప్రదేశ్ సహా ఏడు సర్కిల్స్‌లో దీన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద డేటా చార్జీల ప్రసక్తి లేకుండా 30 పైచిలుకు వెబ్‌సైట్లను ఆర్‌కామ్ ఉచితంగా అందిస్తోంది. ఇంటర్నెట్ సేవలు అందించడంలో టెల్కోలు తటస్థంగా వ్యవహరించాలన్న నెట్ న్యూట్రాలిటీ విధానానికి ఇది విరుద్ధమంటూ ఫేస్‌బుక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజా గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 500 కోట్ల మందికి నెట్ మాధ్యామాన్ని చేరువ చేసే లక్ష్యంతో ఫేస్‌బుక్.. ఈ ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్‌ను ప్రారంభించింది. దీనికోసం శామ్‌సంగ్, క్వాల్‌కామ్ వంటి టెక్నాలజీ దిగ్గజాలతో చేతులు కలిపింది. ఇప్పటికే భారత్ సహా తొమ్మిది దేశాల్లో 80 కోట్ల మందికి నెట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఫేస్‌బుక్ వర్గాలు పేర్కొన్నాయి.