రాబడుల్లో మేటి పనితీరు | Invest in Blue Chip Mutual Funds | Sakshi
Sakshi News home page

రాబడుల్లో మేటి పనితీరు

Published Mon, Oct 21 2019 4:51 AM | Last Updated on Mon, Oct 21 2019 7:36 AM

Invest in Blue Chip Mutual Funds  - Sakshi

ఈక్విటీ ఇన్వెస్టర్లకు గడిచిన ఏడాది, రెండేళ్లు పరీక్షా కాలం వంటిది. ఎన్నో అనిశ్చితులు, ఆందోళనలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. సూచీల్లో పెరుగుదల ఉన్నా కానీ, రిటైల్‌ ఇన్వెస్టర్లు రాబడులు పొందిందీ లేదు. కొందరు నష్టాలు కూడా చవిచూశారు. మార్కెట్‌ అంతటా పెరుగుదల లేకపోవడమే దీనికి కారణం. కేవలం కొన్ని కంపెనీలే మార్కెట్‌ పెరుగుదలకు దోహదపడ్డాయి. అందుకే అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్‌ లీడర్లుగా ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం తెలివైన వ్యూహం అవుతుంది. కనుక భిన్న మార్కెట్‌ పరిస్థితుల్లో అద్భుత పనితీరు చూపించిన లార్జ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలనేది మా సూచన. యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌ దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలంగా ఉంటుంది.   

పెట్టుబడుల విధానం
యాక్సిస్‌ బ్లూచిప్‌ అన్నది లార్జ్‌క్యాప్‌ ఫండ్‌. మంచి వ్యాపార నాణ్యత కలిగిన లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్‌ చేస్తుంది. పోర్ట్‌ఫోలియో పరంగా వైవిధ్యాన్ని కూడా గమనించొచ్చు. 2016 నవంబర్‌ నుంచి ఈ పథకాన్ని శ్రేయాష్‌ దేవల్కర్‌ నిర్వహిస్తున్నారు. బోటమ్‌ అప్‌ విధానంలో స్టాక్స్‌ను, ఫండమెంటల్స్‌(వ్యాపార మూలాలు), వృద్ధి అవకాశాలు, ఆయా కంపెనీలకు పోటీ పరంగా ఉన్న అనుకూలతలు వంటి అంశాల ఆధారంగా ఈ పథకం పెట్టుబడుల కోసం ఎంపిక చేసుకుంటుంది. పథకం నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 80–100% వరకు అధిక నాణ్యత కలిగిన పెద్ద  కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. లార్జ్‌క్యాప్‌ కంపెనీలు ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని స్తాయి. వ్యాపార కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉండడం, నిధుల వ్యయాలు తక్కువగా ఉండడం వల్ల ఆర్థిక మందగమన ప్రభావం వీటిపై తక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం ఫైనాన్షియల్, టెక్నాలజీ స్టాక్స్‌లో ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈ రెండు రంగాల స్టాక్స్‌లో వరుసగా 45%, 14% చొప్పున ఇన్వెస్ట్‌ చేసి ఉంది.  

రాబడుల పనితీరు  
ఈ పథకం నిర్వహణలో సెప్టెంబర్‌ నాటికి రూ.8,050 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రాబడులకు సంబంధించి మంచి చరిత్ర ఉంది. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షికంగా 15.95 శాతం రాబడులిచ్చింది. ఐదేళ్లలో.. వార్షిక పనితీరు 12.30%. కానీ, ఇదే కాలంలో పోటీ పథకాలు ఇచ్చిన రాబడులు మూడేళ్లలో 10.57%, ఐదేళ్లలో 9.26%గానే ఉన్నాయి. ఈ పథకం ప్రారంభం నాటి నుంచి ప్రతీ నెలా రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తూ వచ్చి ఉంటే 2019 సెప్టెంబర్‌30 నాటికి రూ.11.9 లక్షల సంపద సమకూరేది. ఇందులో అసలు పెట్టుబడి రూ.5.8 లక్షలు. ఈ పథకంలో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే కనీసం రూ.5,000 నుంచి..; సిప్‌ రూపంలో అయితే ప్రతీ నెలా కనీసం రూ.500 మొత్తంతో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. సిప్‌ రూపంలో కనీసం ఆరు నెలల పాటు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం, దీర్ఘకాలంలో సంపద సమకూర్చుకోవాలనుకునే వారు కనీసం ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement