సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లో సోమవారం నాటిఅమ్మకాలతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. లాక్‌డౌన్ పొడగింపు, అగ్ర ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య ముదురుతున్న ట్రేడ్ వార్ భయాలతో ప్రపంచమార్కెట్లు ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 1700 పాయింట్ల మేర పతనమైంది. ఆరంభ నష్టాల నుంచి మరింత బలహీన పడిన మార్కెట్ ఒక దశలో 2 086 పాయింట్లు లేదా 6 శాతం కుప్పకూలింది. బ్యాంకింగ్, ఆటో, మెటల్, రియాల్టీ షేర్లు బాగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ 1791 పాయింట్లు లేదా 8శాతం పైగా పడిపోయి 19,744 స్థాయిలకు చేరుకోగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 7.86 శాతం క్షీణించింది. (దీర్ఘకాల లాక్‌డౌన్ : కుప్పకూలిన మార్కెట్లు)
ప్రధానంగా ఆసియా ఈక్విటీలలోని భారీ అమ్మకాల ప్రభావంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది.దీంతో బిఎస్‌ఇ-లిస్టెడ్ కంపెనీల్లో నేటి పతనంతో రూ. 5.8 ట్రిలియన్ల పెట్టుబడిదారుల సంపద తుడుచిపెట్టుకు పోయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 లక్షల 15వేల 309 కోట్ల రూపాయలు తగ్గి 1,24,26,311.83 కోట్లకు చేరుకుంది.(లాక్‌డౌన్ ఎఫెక్ట్ : పీఎంఐ రికార్డు కనిష్టం)
ఐసీఐసీఐ బ్యాంక్ (11 శాతం తగ్గి) ఇండెక్స్‌లో అత్యధిక నష్టాన్ని చవిచూడగా, బజాజ్ ఫైనాన్స్ (10 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ (10 శాతం) ఇండస్ఇండ్ బ్యాంక్ (9.6 శాతం) భారీగా నష్టపోయాయి. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో మార్చి 2020 తో ముగిసిన త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలతో టెక్ మహీంద్రా 8 శాతం, హిందూస్థాన్ యూనిలీవర్ 5 శాతం క్షీణించింది. నిఫ్టీ ఫార్మ మాత్రమే స్వల్పంగా లాభపడింది. అలాగే కొన్ని షరతులతో మద్యం దుకాణాలను ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతించిన తరువాత బ్రూవరీస్ అండ్ డిస్టిలరీ కంపెనీల షేర్లు దాదాపు 11 శాతం వరకు ర్యాలీ చేశాయి. చివరికి 2002 పాయింట్లు పతనంతో సెన్సెక్స్ 31715వద్ద, నిఫ్టీ 566 పాయింట్లు కుప్పకూలి 9293 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా సెన్సెక్స్ 32 వేల దిగువకు చేరగా, నిఫ్టీ 9300 స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. (ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు)
Comments
Please login to add a commentAdd a comment