సరళీకృత ప్రక్రియకు ఇదొక సంకేతం..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రక్షణ, విమానయాన, ఫార్మా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై నిర్ణయాన్ని ప్రకటించడంపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయంపై స్పందించిన ఆయన ప్రభుత్వం కొనసాగించనున్న సరళీకృత విధానాలకు, సంస్కరణలకు ఇది కూడా ఒక సంకేతమని వ్యాఖ్యానించారు.
సింగిల్ బ్రాండ్ రిటైల్, పౌర విమానయానం, విమానాశ్రయాలు, ఔషధాలు, పశు పెట్టుబడులు నిబంధననల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. భారతదేశం లో ఉపాధి , ఉపాధి కల్పనకు ప్రధాన ప్రేరణను అందించే దిశగా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని పాలన సరళీకృతం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్ డీఐ విషయంలో విప్లవాత్మక మార్పులవలన, ప్రపంచంలో ఓపెన్ ఎకానమీగా భారతదేశం అవతరించిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా ఏవియేషన్ రంగంలో 100శాతం పెట్టుబడులు పెట్టేందుకు అనుమతినివ్వడంతో పాటుగా, ప్రభుత్వ అనుమతి పొందిన ట్రేడింగ్, ఈ-కామర్స్, భారత్‌లో తయారయ్యే ఆహార ఉత్పత్తులపై కూడా విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన గల ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్‌ఐపీబీ) మొత్తం 14 ప్రతిపాదనలను పరిశీలించి నాలుగింటికి ఆమోదం తెలిపింది. భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చే యోచనలో ఉన్నట్టు ఇటీవల ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు అటు ఆర్ బీ గ వర్నర్ గా రెండవసారి కొనసాగబోనని రఘురామ రాజన్ ప్రకటించడం, ఇటు వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడం ఆసక్తికరంగా మారింది.