అన్ని మండలాల్లో దుర్భిక్షమే..
ప్రభుత్వం కరువు ప్రకటన
కేంద్రానికి జాబితా అందజేత
రైతులకు అందనున్న సహాయం
పంట రుణాల రీషెడ్యూల్‌కు అవకాశం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని రైతులకు ఉపశమనం కలింగించేలా ప్రభుత్వం మంగళవారం కరువు మండలాలను ప్రకటించింది. జిల్లాలోని 46 మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనతో రైతులకు ఊరట చేకూరనుంది. జిల్లాలోని 46 మండలాలను కరువు మండలాల జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందజేసింది. ఈ క్రమంలో జిల్లాలోని రైతులకు పంటనష్ట పరిహారం అందటంతో పాటు రుణాల రీషెడ్యూల్ జరుగుతుంది. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం చేయూతనందిస్తుంది.
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ కలిసి రాలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో -42 శాతం వర్షాభావం నెలకొంది. పంటలు చేతికి వచ్చే సమయంలో వర్షాలు లేక దిగుబడి సగానికి పడిపోయింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతులు 3.10 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. పత్తి, మొక్కజొన్న, సోయ, పెసర, కంది పంటలు సాగు చేశారు. జూన్,జూలైలలో వర్షాలు లేకపోవడంతో పంటలు మొలక దశలోనే ఎండిపోయాయి. దాదాపు 2.80 లక్షల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది.
వరి దిగుబడీ గణనీయంగా తగ్గింది. కరువు జిల్లాగా ప్రకటించాలని ప్రజాప్రతినిధులు పలు సమావేశాల్లో మంత్రి హరీశ్‌రావును కోరారు. ఆయన తగిన హామీనిచ్చారు. పరిస్థితులపై కలెక్టర్ పూర్తిస్థాయి నివేదికలను తెప్పించుకున్నారు. జిల్లాలోని 46 మండలాల్లో వర్షాభావం ఉండటంతో పాటు పంటలు ఎండిపోయినట్లు రెండు శాఖలు నివేదికలు సమర్పించాయి. 46 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. నివేదిక ఆధారంగా అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది.