ఐటీ ప్రొఫెషనల్స్‌కు రూ.4 లక్షల ఖర్చు
ప్రస్తుతం ఐటీ రంగంలో కొత్త టెక్నాలజీల వల్ల తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ టెక్నాలజీల ప్రభావంతో ఐటీ ప్రొఫెషనల్స్ తమను తాము రీస్కిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బెంగళూరు : ప్రస్తుతం ఐటీ రంగంలో కొత్త టెక్నాలజీల వల్ల తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ టెక్నాలజీల ప్రభావంతో ఐటీ ప్రొఫెషనల్స్ తమను తాము రీస్కిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటి కోసం ఐటీ ప్రొఫెషనల్స్ భారీ ఎత్తున ఖర్చు కూడా చేయాల్సి వస్తోంది. తాజా నివేదికల ప్రకారం మంచి స్థానాల్లోకి ఐటీ ప్రొఫెషనల్స్ వెళ్లాలంటే కొత్త టెక్నాలజీ కోర్సులను నేర్చుకోవాల్సి ఉందని, వీటి కోసం ఐటీ ప్రొఫెషనల్స్ రూ.4 లక్షల మేర ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిసింది. ఈ కోర్సులు కూడా ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రిలో 5-10 ఏళ్ల అనుభవమున్న ప్రొఫెషనల్స్‌లో ఎక్కువగా పాపులర్ అయినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ కోర్సుల వ్యవధి సాధారణంగా 10-12 నెలల ఉంటుందని, ఆన్‌లైన్ వీడియో క్లాస్‌లు, అసైన్‌మెంట్స్, టెస్ట్‌ల ద్వారా వీటిని నేర్చుకోవాల్సి ఉంటుందని తాజా నివేదికలు తెలిపాయి.
చాలా కంపెనీలకు ఉద్యోగులను రీస్కిల్ చేయడానికి సమయం, అవకాశం లేదని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ హెడ్‌హంటర్స్ ఇండియా వ్యవస్థాపకుడు క్రిష్ లక్ష్మికాంత్ తెలిపారు. ఈ కారణంతో చాలామంది మధ్యస్థాయి మేనేజర్లు తమకు తాముగా ఆన్‌లైన్ కోర్సులను నేర్చుకుంటూ, తమ ఉద్యోగాలను కాపాడుకుంటున్నారని లేదా మంచి మంచి స్థానాల్లోకి ప్లేస్ అవుతున్నట్టు చెప్పారు. కొత్త టెక్నాలజీ కోర్సులు నేర్చుకోవడం కోసం ఐటీ ప్రొఫెషనల్స్ రుణాలు కూడా తీసుకుంటున్నట్టు ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్రొవైడర్ అప్‌గ్రాడ్ వ్యవస్థాపకుడు మయాంక్ కుమార్ పేర్కొన్నారు. ఐఎస్‌బీ లేదా ఇతర ఎంబీఏ కాలేజీల్లో ఏడాది కోర్సులు చేయడానికి రూ.6 లక్షలు ఖర్చు అవుతుందని, వాటితో పోల్చుకుంటే కొత్త టెక్నాలజీల కోసం పెట్టే ఖర్చు తక్కువేనని తెలిపారు.
ప్రస్తుతం ఐటీలో మామూలు ఉద్యోగాలు కనుమరుగు అవుతున్నాయి. కొత్త టెక్నాలజీలకే ఐటీ సంస్థలు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయి. డేటా అనాలిటిక్స్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త టెక్నాలజీకే ప్రస్తుతం ఉద్యోగ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ప్లాట్ఫామ్‌లు కూడా కొత్త టెక్నాలజీల కోర్సులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. చెన్నైకు చెందిన మేనేజ్‌మెంట్ కాలేజీ గ్రేట్ లీక్స్ ఇన్‌స్టిట్యూట్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ గ్రేట్ లెర్నింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను లాంచ్ చేసింది.
ఈ ఇన్‌స్టిట్యూట్ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు బిగ్‌డేటా, బిజినెస్ అనాలిటిక్స్‌ను ఆఫర్ చేస్తోంది. వీటికి ఒక్కో దానికి రూ.4 లక్షల మేర ఖర్చు అవుతుందని తెలిసింది. ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ చేసే సర్టిఫికేషన్ కోర్సులు కొత్తగా ఉద్యోగం దరఖాస్తు చేసుకోవడానికి సాయపడతాయని, డేటా సైన్సులో ఉద్యోగం పొందితే కనీసం 40 శాతం వేతనం పెంపు ఉంటుందని కాగ్నిజెంట్‌కు చెందిన ఓ ఉద్యోగి పేర్కొన్నారు. అదేవిధంగా ఇతర మీ స్కిల్స్, ప్రొఫైల్ బట్టి కూడా వేతనం ఉంటుందని చెప్పారు.