
ఐటీసీ లాభం 2,647 కోట్లు
6 శాతం వృద్ధి
• పెద్ద నోట్ల రద్దుతో మందగించిన వ్యాపారం
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీపై పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం పడింది. డిమాండ్ తగ్గి వ్యాపారం మందగించింది. మొత్తం మీద కంపెనీ ఆర్థిక ఫలితాలు ఓ మెస్తరుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో నికర లాభం 6 శాతం పెరిగిందని ఐటీసీ తెలిపింది. గత క్యూ3లో రూ.2,504 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.2,647 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సిగరెట్ వ్యాపారంలో ప్రతికూలతలు, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా డిమాండ్ తగ్గడం ప్రభావం చూపాయని వివరించింది. గత క్యూ3లో రూ.12,962 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 5 శాతం వృద్ధితో రూ. 13,570 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇబిటా రూ.3,475 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.3,546 కోట్లకు పెరగ్గా, మార్జిన్లు 26.8 శాతం నుంచి 26.1 శాతానికి పడిపోయాయని తెలిపింది.
మందకొడిగా సిగరెట్ల వ్యాపారం...
పెద్ద నోట్ల రద్దు, నిబంధనలు కఠినంగా మారుతుండడం, పన్నుల భారం తదితర అంశాల కారణంగా సిగరెట్ల వ్యాపారం మందకొడిగా ఉందని ఐటీసీ పేర్కొంది. సిగరెట్ల వ్యాపారం ఆదాయం రూ.8,106 కోట్ల నుంచి 2.2 శాతం ఎగసి 8,288 కోట్లకు చేరిందని వివరించింది. సిగరెట్లతో కలుపుకొని ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం రూ.10,591 కోట్ల నుంచి 2.5 శాతం పుంజుకొని రూ.10,857 కోట్లకు, ఇతర ఎఫ్‌ఎంసీజీ సెగ్మెంట్ వ్యాపారం రూ.2,485 కోట్ల నుంచి 3.3 శాతం వృద్ధితో 2,569కు పెరిగాయని వివరించింది. హోటల్ వ్యాపారం రూ.345 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.371 కోట్లకు, వ్యవసాయ వ్యాపారం ఆదాయం రూ.1,481 కోట్ల నుంచి 13 శాతం పెరిగి రూ.1,672 కోట్లకు పెరిగాయని, పేపర్‌బోర్డ్‌లు, పేపర్, ప్యాకేజింగ్ వ్యాపారం ఆదాయం రూ.1,338 కోట్ల నుంచి రూ.1,336 కోట్లకు తగ్గిందని తెలిపింది.
అన్ని సెగ్మెంట్లపై నోట్ల రద్దు ఎఫెక్ట్..
పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం బాగా దెబ్బతిన్నదని ఐటీసీ పేర్కొంది. బిస్కెట్స్, స్నాక్స్, నూడుల్స్, పర్సనల్ కేర్ ఉత్పత్తులు, బ్రాండెడ్ దుస్తులు.. అన్నిరంగాలపై నోట్ల రద్దు ప్రభావం పడిందని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని తట్టుకోవడానికి పలు చర్యలు తీసుకున్నామని, త్రైమాసికం చివర్లో నోట్ల కొరత సమస్య తగ్గుముఖం పట్టడంతో అమ్మకాలు పుంజుకున్నాయని వివరించింది.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేర్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. డీమోనిటైజేషన్ పరిస్థితుల్లోనూ నికర లాభం పెరగడంతో ఈ షేర్ బీఎస్‌ఈలో ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి రూ.267ను తాకింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 6 శాతం వరకూ ఈ షేర్ పెరిగిన నేపథ్యంలో ట్రేడింగ్ చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. చివరకు 2.7 శాతం నష్టంతో రూ.257 వద్ద ముగిసింది.