హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో అమల్లోకి వస్తున్న బీఎస్–6 ప్రమాణాలు దేశీ ద్విచక్ర వాహన పరిశ్రమను పీకల్లోతు కష్టాల్లోకి నెడుతున్నాయి. ‘‘2019లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ప్రమాణాలు.. ఆపై ఏడాది 2020లో బీఎస్–6 ప్రమాణాలున్న వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తామని కేంద్రం నిబంధన పెట్టింది. దీంతో తయారీ సంస్థలు వీటి మీదే దృష్టిపెట్టాయి. కానీ, బీఎస్–6 టెక్నాలజీ, ఆర్‌అండ్‌డీ, మెటీరియల్ బాగా వ్యయ, ప్రయాసలతో కూడినవి. దీంతో వాహన ధరలు పెరుగుతాయి. దీనికి కస్టమర్లు ఎలా స్పందిస్తారన్నదే ప్రశ్న’’ అని హోండా మోటార్ అండ్ సైకిల్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రెసిడెంట్ అండ్ సీఈవో మినోరు కాటో చెప్పారు. ఏబీఎస్, బీఎస్–6 ప్రమాణాల మధ్య ఏడాది గ్యాప్‌లోనే ధరలు పెరగడం కస్టమర్లు భరించలేరన్నారు. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహన తయారీ సంస్థలకు చాలెంజింగ్‌గా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2018–19లో హెచ్‌ఎంఎస్‌ఐ ప్రణాళికల గురించి న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ‘సాక్షి బిజినెస్’ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలివీ...
అన్నిటికీ అప్‌గ్రేడెడ్ మోడళ్లు
2020 నాటికి మార్కెట్లోకి బీఎస్–6 వాహనాలను విడుదల చేయాలని నిర్ణయించాం. సాంకేతికత, ఆర్‌అండ్‌డీ, ఉత్పత్తుల తయారీ, నాణ్యతపై పరిశోధనలు వేగవంతం చేశాం. 2018–19 ఆర్ధిక సంవత్సరంలో దేశంలో రూ.800 కోట్ల పెట్టుబడులు పెడతాం. ఈ ఏడాది మార్కెట్లోకి ఒక కొత్త బైక్‌తో పాటు 18 అప్‌గ్రేడ్ మోడల్స్‌ను తెస్తాం. ప్రస్తుతం విపణిలోకి ఉన్న హోండా స్కూటర్స్ అన్నిటికీ అప్‌గ్రేడెడ్ మోడల్స్ విడుదల చేస్తాం.
హోండా ప్రీ ఓన్డ్ బైకులు..
దేశంలో ప్రీ ఓన్డ్ వాహనాలనూ విక్రయించే ద్విచక్ర వాహన తయారీ సంస్థ మాదొక్కటే. 2011లో బెస్ట్ డీల్ బ్రాండ్ పేరిట ప్రీ ఓన్డ్ స్టోర్లను ప్రారంభించాం. ఇప్పటివరకు దేశంలో 200 స్టోర్లున్నాయి. ప్రతి స్టోర్‌లో నెలకు 20 వాహనాలను అమ్ముడవుతున్నాయి. ఇప్పటివరకు లక్ష ద్విచక్ర వాహనాలను విక్రయించాం. బెస్ట్ డీల్ ప్రత్యేకత ఏమంటే.. ఏ కంపెనీ బైక్ లేదా స్కూటర్‌నైనా కొంటాం. అమ్మేది మాత్రం కేవలం హోండా ద్విచక్ర వాహనాలే. 6 నెలల వారంటీ, 2 ఉచిత సర్వీసులు కూడా ఉంటాయి. ఈ ఏడాది ప్రీ ఓన్డ్ సెంటర్లను 250కి చేరుస్తాం. 2017–18 ఆర్ధిక సంవత్సరంలో దేశంలో మొత్తంగా 20 మిలియన్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయాయి. 6 ఏళ్ల తర్వాత తొలిసారిగా పరిశ్రమ 15 శాతం వృద్ధిని నమోదు చేసింది.
గతేడాది 60 లక్షల విక్రయాలు..
2016–17లో 50 లక్షల వాహనాలను విక్రయించిన హోండా.. గత ఆర్థిక సంవత్సరంలో 27 శాతం వృద్ధితో 60 లక్షలకు చేరింది. ఇందులో స్కూటర్లు 20 శాతం, మోటార్ సైకిల్స్ వాటా 14 శాతం. ఎగుమతులు తొలిసారిగా 23 శాతం వృద్ధితో 3 లక్షల మార్క్‌ను దాటాయి. మా మొత్తం అమ్మకాల్లో ఎగుమతుల వాటా 5 శాతం. శ్రీలంక, నేపాల్, కొలంబియా, బంగ్లాదేశ్ వంటి 27 దేశాలకు హోండా ద్విచక్ర వాహనాలు ఎగుమతి అవుతున్నాయి. మా మొత్తం అమ్మకాల్లో గ్రామీణ మార్కెట్ వాటా 28–30 శాతం వరకూ ఉంటుంది.
64 లక్షలకు ఉత్పత్తి సామర్థ్యం
ప్రస్తుతం హోండాకు దేశంలో 4 తయారీ కేంద్రాలున్నాయి. హరియాణా, రాజస్తాన్, కర్ణాటక, గుజరాత్‌లో ప్లాంట్లున్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 64 లక్షలు. బీఎస్–6 తర్వాత ధరల స్థిరీకరణ జరిగాక.. ప్రస్తుతమున్న ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం సరిపోదు. అందుకే దేశంలో 5వ ప్లాంట్ ఏర్పాటుపై జపాన్‌లోని ప్రధాన కార్యాలయంలో చర్చలు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రమనేది ఇంకా నిర్ణయానికి రాలేదు. దేశంలో 5,750 డీలర్‌షిప్స్ ఉన్నాయి. వీటిని ఈ ఏడాది 6 వేలకు చేర్చనున్నాం. 70 శాతం నెట్‌వర్క్ విస్తరణ గ్రామీణ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment