
సాక్షి, న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతూ విమాన సర్వీసులను నిలిపివేస్తున్న జెట్ ఎయిర్‌వేస్ తాజాగా మరోషాకింగ్ న్యూస్ చెప్పింది. ఇవాళ, రేపు( ఏప్రిల్ 11,12) అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆమ్‌స్టర్‌డాం, ప్యారిస్, లండన్‌కు సర్వీసులను నిలిపి వేసింది. నిధుల లేమి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
దీనికి తోడు లీజు చెల్లించలేక మరో 10 విమానాలను రద్దు చేస్తున్నట్టు జెట్ ఎయిర్‌వేస్ గురువారం బీఎస్‌ఈ ఫైలింగ్‌లో ప్రకటించింది. దీంతో బకాయిలు చెల్లించలేక నిలిచిపోయిన విమానాల సంఖ్య మొత్తం 79 కి చేరింది.
మరోవైపు జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలను అటు ప్రభుత్వం, ఇటు డీజీసీఏ పరిశీలిస్తోంది. నిబంధనల ప్రకారం, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపాలంటే ఎయిర్‌లైన్స్ కనీసం 20 విమానాలను కలిగి వుండాలి. అయితే గత నెలనుంచి కేవలం14 విమానాలను మాత్రమే నడుపుతోంది. ఇది అంతర్జాతీయ కార్యకలాపాలను నిలిపి వేయడానికి దారి తీయనుంది. ఒకవైపు జెట్ ఎయిర్‌వేస్‌ను గట్టెక్కించే ప్రయత్నాలు కొనసాగుతుండగానే, తాజా పరిమాణాలతో జెట్ ఎయిర్‌వేస్ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్నట్టు దారుణంగా తయారవుతోంది.