
న్యూఢిల్లీ: కొన్ని త్రైమాసికాలుగా భారీ నష్టాలను చవిచూస్తూ... ఉద్యోగుల వేతనాలు చెల్లించడానికి సైతం ఇబ్బందులు పడుతున్న జెట్ ఎయిర్‌వేస్‌కు కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. తీసుకున్న రుణాలకు వాయిదాలను చెల్లించడంలో సంస్థ విఫలమైంది. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని దేశీయ బ్యాంకుల కన్సార్షియానికి రుణంలో అసలును, వడ్డీని కలిపి డిసెంబరు 31న చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించలేకపోయింది. తాత్కాలిక నగదు ప్రవాహాల్లో తారతమ్యాలే దీనికి కారణమని జెట్ ఎయిర్‌వేస్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. రుణ చెల్లింపులకు సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపింది. జెట్ ఎయిర్‌వేస్ ఖాతాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్‌బీఐ ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించింది. వరుసగా గత మూడు త్రైమాసికాలుగా జెట్‌ఎయిర్‌వేస్ రూ.1,000 కోట్లకుపైగా నష్టాలను ప్రకటిస్తూ వస్తోంది. నష్టాల తగ్గింపు చర్యల్లో భాగంగా కొంత మంది ఉద్యోగులను తొలగించింది. లాభదాయకం కాని మార్గాల్లో సర్వీసులను కూడా నిలిపివేసింది. కాగా, మూలధన అవసరాల కోసం, కొన్ని రకాల చెల్లింపులకు రూ.1,500 కోట్ల మేర స్వల్పకాలిక రుణం తీసుకునే ప్రయత్నాలను సంస్థ ప్రారంభించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.
రేటింగ్ తగ్గింపు
జెట్‌ఎయిర్‌వేస్ దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణ సదుపాయాల రేటింగ్‌ను తగ్గిస్తున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం ప్రకటించింది. ‘‘యాజమాన్యం నుంచి లిక్విడిటీ పెంపు చర్యల అమలులో జాప్యం నెలకొంది. దీంతో లిక్విడిటీ సమస్య తీవ్రతరం అయింది. కంపెనీ ఇప్పటికే ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, విమానాల అద్దె చెల్లింపులనూ ఆలస్యం చేస్తోంది’’అని ఇక్రా తన నిర్ణయం వెనుక కారణాలను తెలియజేసింది. జెట్ ఎయిర్‌వేస్ 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు రూ.1,700 కోట్ల మేర, 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.2,444 కోట్లు, రూ.2020–21లో రూ.2,167 కోట్ల మేర బకాయిలను తీర్చాల్సి ఉందని ఇక్రా తెలియజేసింది.
షేరుకు అమ్మకాల ఒత్తిడి
జెట్ ఎయిర్‌వేస్ రుణ చెల్లింపుల్లో విఫలమైందన్న సమాచారం బయటకు రావడంతో... కంపెనీ షేర్ల అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో బీఎస్‌ఈలో 6 శాతానికి పైగా నష్టపోయి రూ.263.75 వద్ద క్లోజయింది. ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం వరకు నష్టపోయింది.
Comments
Please login to add a commentAdd a comment