
సీబీడీటీ చైర్మన్‌గా కేవీ చౌదరి బాధ్యతలు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) కొత్త చైర్మన్‌గా కేవీ చౌదరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్‌కే తివారీ గురువారం పదవీ విరమణ నేపథ్యంలో చౌదరి నియామకం జరిగింది. మూడు నెలల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. 1978 బ్యాచ్, సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన కేవీ చౌదరి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.
పన్నుల రంగంలోని పలు విభాగాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. ప్రత్యక్ష పన్నుల విభాగంలోని రెవెన్యూ వసూళ్ల బోర్డ్(ఇన్వెస్ట్‌గేషన్)లో సభ్యునిగా ఇప్పటివరకూ ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, హెచ్‌ఎస్‌బీసీ జెనీవా ట్యాక్స్‌పేయర్స్ జాబితాసహా నల్లధనం, పన్ను ఎగవేతల వంటి పలు కీలక కేసుల్లో దర్యాప్తు జరిపిన బృందాల్లో సభ్యునిగా చౌదరి పనిచేశారు.
ట్యాక్స్‌పేయర్ల సమస్యలు పరిష్కరిస్తా..
పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, పన్ను వివాదాల పరిష్కారంపై వెంటనే దృష్టిపెడతానని చౌదరి తెలిపారు. సీబీడీటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులకు సందేశమిచ్చారు. ‘రెవిన్యూ వసూళ్లే కాకుండా.. చిత్తశుద్ధితో దృష్టిపెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. పన్ను చెల్లింపుదార్ల ఇక్కట్లను, విజ్ఞప్తులను త్వరగా, హేతుబద్ధంగా పరిష్కరించాలి. అందరూ పన్నులు చెల్లించేలా చూడాలి. అనవసర వేధింపులకు పాల్పడకుండానే రెవిన్యూ వసూళ్ల లక్ష్యాల సాధనకు యత్నించాలి. స్నేహపూర్వక ప్రవర్తన, వృత్తి నైపుణ్యాలతో ఐటీ శాఖ ప్రతిష్టను పెంచాలి’ అని పేర్కొన్నారు.