
కబాలి రా!!
‘‘మిగతా హీరోలు సెలవు చూసుకుని వస్తారు. రజనీకాంత్ వస్తే సెలవే వస్తుంది’’
♦ నిజం! రజనీ సెలవు తీసుకొచ్చాడు
♦ బెంగళూరు స్టార్టప్‌లకు ఫ్రైడే హాలిడే
♦ ఇప్పటికే కబాలి నాణేలు, బొమ్మలు, సిమ్‌లు
♦ ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ రోజుకు 4 షోలు
సాక్షి, ప్రత్యేక విభాగం : ‘‘మిగతా హీరోలు సెలవు చూసుకుని వస్తారు. రజనీకాంత్ వస్తే సెలవే వస్తుంది’’ ఇదీ సినిమాలపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జోక్. 22న శుక్రవారం రజనీ కాంత్ ‘కబాలి’ సినిమా విడుదలవుతోంది. తరవాత పరిస్థితి ఏమోగానీ... విడుదలకు ముందు మాత్రం కొత్త రికార్డులు రాస్తోంది. బ్రాండింగ్‌కు ప్రొడ్యూసర్లు కొత్త పుంతలు తొక్కటంతో ఇపుడు ‘కబాలి’ చుట్టూ పెద్ద వ్యాపారమే జరుగుతోంది. ఆ వివరాలే ఈ కథనం...
⇒ చెన్నైలో 3 రోజుల టిక్కెట్లు మొత్తం ముందే బుక్ అయిపోయాయి. ఇదేమీ విశేషం కాకపోయినా... తమకు టికెట్లు దొరకడం లేదని, దొరికినా ఎక్కువ రేట్లు పెట్టాల్సి వస్తోందని ప్రేక్షకులు పోలీస్ కేసులు పెట్టడం గమనార్హం. ఇక దుబాయ్, జపాన్, మలేషియా, లండన్‌ల్లో ఉన్న పలువురు రజినీ అభిమానులు కబాలి తొలి రోజు తొలి ఆట చూడ్డానికి రికార్డ్ స్థాయిలో చెన్నైకి వస్తున్నారు.
⇒ ఫైవ్ స్టార్ హోటళ్లలో స్పెషల్ షోలు వేసే విదేశీ సంస్కృతి కబాలితో ఇండియాకూ వచ్చేసింది. బెంగళూరులోని నాలుగు ఫైవ్‌స్టార్ హోటళ్లు-జేడబ్ల్యూ మారియట్, లలిత్ అశోక్, రాయల్ ఆర్చిడ్, క్రౌన్ ప్లాజాల్లో 3 రోజుల పాటు, రోజుకు 4 ఆటలు చొప్పున కబాలి సినిమా చూపిస్తున్నాయి. టికెట్ ధర రూ.1,300- రూ.1,400 రేంజ్‌లో ఉంది.
⇒ చెన్నై, బెంగళూరుల్లోని పలు స్టార్టప్‌లు శుక్రవారం సెలవు ప్రకటించాయి. ఫ్రెష్ డెస్క్, గో బంపర్, ద సోషల్‌పీపుల్ వంటి స్టార్టప్‌లు ఈ జాబితాలో ఉన్నా యి. ఓయేత్రీడాట్‌కామ్ ఏకంగా 2 ఐనాక్స్ స్క్రీన్లనే బుక్ చేసింది. తమ ఉద్యోగులతో పాటు తమ వెబ్‌సైట్‌లో షాపింగ్ చేసిన వారికీ సినిమా చూపిస్తామంటోంది. బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మేల్యే మునిరత్న నాయుడు తమ పార్టీ కార్యకర్తల కోసం 4 హాళ్లలో టికెట్లు బుక్ చేశారు.
⇒ కబాలి సినిమాకు అఫీషియల్ ఎయిర్‌లైన్ పార్ట్‌నర్‌గా వ్యవహిరిస్తున్న ఎయిర్ ఏసియా... ఒక విమానాన్ని కబాలి పోస్టర్లు, స్టిక్కర్లతో అలంకరించింది. ఈ విమానం వైజాగ్, బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణే, చంఢీగర్, జైపూర్, గౌహతి, ఇంఫాల్, కోచి తదితర రూట్లలో నడుస్తుంది. కబాలి ఫస్ట్ షో చూడాలనుకునే వారికోసం బెంగళూరు నుంచి చెన్నైకు ప్రత్యేక విమానం కూడా నడుపుతోందీ సంస్థ.
⇒ కేరళకు చెందిన ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ... 5, 10, 20 గ్రాముల్లో కబాలి వెండి నాణేలను అందుబాటులోకి తెచ్చింది. రజనీకాంత్ కబాలి మార్క్‌తో ఈ వెండి నాణేలను, ఒక పెండెండ్‌ను కూడా అందిస్తోంది.
⇒ ధోర్, ఐరన్-మ్యాన్ వంటి సూపర్ హీరోల తరహాలో సింగపూర్‌కు చెందిన కార్బన్ కాపీ కలెక్టిబుల్స్ సంస్థ కబాలి ప్రతిమలను తయారు చేస్తోంది. ఒక్కోటి రూ.1,000 వరకూ ధర ఉండే వీటిని రిటైల్ అవుట్‌లెట్లు, కంపెనీ వెబ్‌సైట్, అమెజాన్‌డాట్‌ఇన్‌లో కొనుగోలు చేయొచ్చు.
⇒ ఎయిర్‌టెల్ కంపెనీ కబాలి పైకవర్‌తో సిమ్‌లు విక్రయిస్తోంది. క్యాడ్‌బరీ కంపెనీ ‘సూపర్‌స్టార్ కా 5 స్టార్’ పేరుతో చాక్లెట్లను అమ్ముతోంది. సిమ్ కవర్లు, టీ షర్ట్‌లు, కీ చెయిన్‌లు వెల్లువలా మార్కెట్లోకి వచ్చేశాయి.