కాకినాడ పోర్ట్ నుంచి భారీ ఆదాయం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ పోర్టు 2020 నాటికి దేశంలోనే అగ్రస్థానంలో ఉంటుందని కస్టమ్స్ కమిషనర్ ఎస్.కె. రెహ్మాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కస్టమ్స్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ సహా పలు పోర్టుల్లో ఎగుమతి, దిగుమతులకు కేంద్ర బడ్జెట్ మరింత ఊపునిస్తోందన్నారు. సాగరమాలలో కాకినాడ పోర్టు ఆణిముత్యంగా నిలుస్తుందన్నారు.
ప్రపంచ పోర్టుల ప్రగతి జాబితాలో గతంలో 54వ స్థానంలో ఉన్న మన దేశం ప్రస్తుతం 37వ స్థానానికి చేరుకుందన్నారు. గంట, రెండు గంటల్లోనే అనుమతి ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడంతో ఎగుమతులు, దిగుమతులు పెరుగుతున్నాయన్నారు. కాకినాడ కస్టమ్స్ గత ఏడాది రూ.1208 కోట్ల ఆదాయం సాధించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1390 కోట్లు లక్ష్యంగా నిర్ణయించామని రెహ్మాన్ చెప్పారు.