
ఇన్‌సెట్‌లో నిందితుడు ధృవ
సాక్షి, బెంగళూరు : ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం 'అమోజాన్'కే కుచ్చుటోపీ పెట్టాడో ప్రబుద్ధుడు. కంపెనీ ఇచ్చిన ట్యాబ్‌తోనే మోసానికి పాల్పడ్డాడు. డెబిట్/క్రెడిట్ కార్డుల ట్యాంపరింగ్ ద్వారా ఏకంగా రూ.1.3 కోట్ల మేర కంపెనీని ముంచేశాడు. తనఫ్రెండ్స్ ద్వారా విలువైన ఆస్తులను ఆర్డర్ చేయడం.. ఎలాంటి చెల్లింపు చేయకుండానే ఆయా ప్రొడక్ట్‌లను సొంతం చేసుకోవడం ఇదీ ఇతగాడి మోడస్ ఒపరాండీ.. దీంతో కేవలం అయిదు నెలల్లోనే రూ. కోటికి పైగా కంపెనీకి నష్టం కలిగించాడు. కంపెనీ త్రైమాసిక ఆడిట్ సమయంలో ఈ మోసం వెలుగు చూసింది.
వివరాల్లోకెళితే...కర్ణాటకలోని చిక్కమంగళూరుకు చెందిన దర్శన్ అలియాస్ ధృవ (25) తన మిత్రులతో కలిసి ఖరీదైన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేవాడు. ఎలాంటి నగదు బదిలీలు లేకుండానే వాటిని అక్రమంగా డెలివరీ చేసుకున్నాడు. సెప్టెంబరు, 2017-ఫిబ్రవరి, 2018 మధ్యకాలంలో ఆ అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో అమోజాన్ కంపెనీకి చిక్కమంగళూరు నగరం నుంచి 4,604 ఆర్డర్లు వచ్చాయి. ఏకదంత కొరియర్ ఏజెన్సీతో అమెజాన్‌కు ఒప్పందం ఉంది. ఈ కొరియర్ ఏజెన్సీలో డెలీవరీ బాయ్‌గా పనిచేస్తున్న దర్శన్ ఈ మోసానికి తెగబడ్డాడు.
ఈ వ్యవహారంపై మార్చి 8న అమెజాన్ సీనియర్ మేనేజర్ నవీన్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్డు పేమెంట్ సిస్టమ్‌ను టాంపరింగ్ చేయడం ద్వారా ఇంతపెద్ద మోసానికి నిందితుడు పాల్పడ్డాడని ఎస్‌పీ కే.అన్నామలై మీడియాకి తెలిపారు. కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్శన్ సహా పునీత్ (19) సచిన్ షెట్టి, (18) అనిల్ షెట్టి, (24) అనే నలుగురు యువకుల్ని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఆయన వెల్లడించారు. ట్యాబ్‌ను ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు తరలించామనీ, నిందితుల నుంచి రూ.25 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 21 స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్, మరో ఐపాడ్, ఓ యాపిల్ వాచ్‌లుతో పాటు, నాలుగు బైక్‌లు ఉన్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment