న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) తీవ్ర ఆర్థిక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని అమెజాన్ ఆరోపించింది. ఈ మేరకు స్వయంగా ఫ్యూచర్ రిటైల్ ఇండిపెండెంట్ డైరెక్టర్లకు ఒక లేఖ రాసింది. ఇందుకు సంబంధించి ఆర్‌ఎఫ్‌ఎల్, ఇతర ఫ్యూచర్ గ్రూప్ సంస్థల చోటుచేసుకున్న లావాదేవీలపై ‘‘ ‘పూర్తి, స్వతంత్ర పరిశీలన‘ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కాగా, అసలు ఇలాంటి లేఖ రాసే ఎటువంటి అర్హతా అమెజాన్‌కు లేదని ఫ్యూచర్ రిటైల్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జారీ చేసిన ఒక నోటీసును ఎదుర్కొనే క్రమంలో అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం ఈ తరహా ఆరోపణలు చేస్తోందని పేర్కొంది.
లేఖ సారాంశమిది...
ఎఫ్‌ఆర్‌ఎల్ ఇండిపెండెంట్ డైరెక్టర్లకు అమెజాన్ లేఖ విషయానికి వస్తే, ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఫ్యూచర్ 7–ఇండియా కన్వీనియన్స్ లిమిటెడ్‌సహా వివిధ ఫ్యూచర్ గ్రూప్ సంస్థలతో ఎఫ్‌ఆర్‌ఎల్ తరచూ ‘‘కీలక లావాదేవీల అవగాహనను’’ చేసుకుంటోంది. సంబంధిత గ్రూప్ సంస్థల్లో కొన్ని తమ వ్యాపారాలకు ప్రధానంగా ఎఫ్‌ఆర్‌ఎల్‌పైనే ఆధారపడుతున్నాయి. ఆయా అంశాల్లో తీవ్ర ఆర్థిక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ఎఫ్‌ఆర్‌ఎల్ ఆర్థిక నిర్వహణ విషయంపై ఆడిట్ కమిటీ సభ్యులు (ప్రస్తుత మరియు గత సభ్యులు) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్‌ఎల్‌ఆర్, గ్రూప్ సంస్థల మధ్య అవగాహనకు సంబంధించిన అంశాలూ ఇందులో ఉన్నాయి. 2019 డిసెంబర్‌లో 2020 జనవరిలో తగిన ఈక్విటీ, రుణ నిధిని సమకూర్చుకున్నప్పటికీ, ఎఫ్‌ఆర్‌ఎల్‌లో రుణ భారం పెరగడానికి కారణాలు ఏమిటన్నది తెలుసుకోడానికి స్వతంత్ర నిపుణుల సంస్థతో విచారణ చేయాలని ఆడిట్ కమిటీ కూడా సిఫారసు చేయడం గమనార్హం. ఈ వాస్తవాలను అమెజాన్ స్వతంత్ర డైరెక్టర్ల దృష్టికి ఎందుకు తీసుకువస్తున్నదంటే, వారు వారి చట్టబద్ధమైన, విశ్వసనీయ బాధ్యతలకు అనుగుణంగా పబ్లిక్ షేర్‌హోల్డర్లు, రుణదాతలు, బ్యాంకర్లు, మూడవ పార్టీ సప్లైయర్లు ప్రయోజనాల కోసం ఈ సమస్యలను వివరంగా విశ్లేషించవచ్చు. దర్యాప్తు చేయవచ్చు.
ఫ్యూచర్ ప్రతినిధి ఖండన
కాగా, ఎఫ్‌ఆర్‌ఎల్‌లో అమెజాన్ వాటాదారుకానీ, రుణ దారుకానీ కానప్పుడు ఈ లేఖ ఎలా రాస్తుందని ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధి ప్రశ్నించారు. ఎఫ్‌సీపీఎల్ (ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్)లో అమెజాన్ పెట్టుబడికి ఇచ్చిన ఆమోదాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ సంస్థ (ఎఫ్‌సీపీఎల్) కాంపిటేటివ్ కమిషన్ ఆప్ ఇండియాలో దరఖాస్తు చేసిందని, దీనికి విరుగుడుగా ముందుజాగ్రత్తగా తప్పుడు ఉద్దేశాలతో అమెజాన్ తాజాగా ఈ లేఖ రాసిందని ఆయన పేర్కొన్నారు.
సుదీర్ఘ న్యాయ వివాదం
రిలయన్స్‌కు ఫ్యూచర్ గ్రూప్‌ల ఆస్తుల విక్రయానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందం వివాదం ప్రస్తుతం సింగపూర్ అర్ర్‌బిటేషన్, సుప్రీంకోర్టు న్యాయపరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాదారైన అమెజాన్‌కు.. ఎఫ్‌ఆర్‌ఎల్‌లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయన్నది అమెజాన్ వాదన. మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్‌నకు లీగల్ నోటీసులు పంపింది.
గత ఒప్పందాల ప్రకారం, ఫ్యూచర్ వ్యాపారాలను తనకే అమ్మాలని స్పష్టం చేసింది. అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్జి అమెజాన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక్కడ అమెజాన్‌కు అనుకూలంగా రూలింగ్ వచ్చింది. దేశంలో లక్ష కోట్ల రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలన్నదే ఆయా సంస్థల న్యాయపోరాటం ప్రధాన ధ్యేయమన్న విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment