హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్ ఉపకరణాల ప్రదర్శన, సదస్సు ‘ఇండియా గాడ్జెట్ ఎక్స్‌పో 2015’ ఇక్కడి హైటెక్స్ వేదికగా శుక్రవారం మొదలైంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ ఎక్స్‌పోను ప్రారంభించారు. ప్రదర్శన 21 వరకు సాగనుంది. గాడ్జెట్ ఎక్స్‌పో హైదరాబాద్‌లో జరగడం ఇది రెండోసారి. 100కుపైగా దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడ తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. నూతన టెక్నాలజీని, ఉపకరణాలను ఇవి ప్రదర్శిస్తున్నాయి. 50 స్టార్టప్ కంపెనీలు సైతం ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేయడం విశేషం.
ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు 5 ఉత్పాదనలను ఆవిష్కరించనున్నారు. ఓర్విటో, బి-వన్‌లు ప్రపంచంలో తొలిసారిగా తమ ఉత్పాదనలను ప్రదర్శిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇండియా గాడ్జెట్ ఎక్స్‌పో ప్రపంచ ప్రముఖ ప్రదర్శనల్లో ఒకటిగా నిలుస్తుందని తారక రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టెక్నాలజీ ఇంకుబేషన్ కేంద్రం ‘టి-హబ్’ ప్రారంభోత్సవం అక్టోబరులో జరుగుతుందని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకట్టుకోవడంలో భాగంగా గాడ్జెట్ ఎక్స్‌పో వేదికగా 100 కంపెనీల సీఈవోలతో సమావేశమవుతున్నట్టు తెలిపారు. ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ రంగంలో ఉన్న ఎస్‌ఎంఈల కోసం టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఎక్స్‌పో చైర్మన్ జె.ఎ.చౌదరి ఈ సందర్భంగా మంత్రిని కోరారు.
సేఫర్ పెండెంట్..
చూడ్డానికి ఇది పెండెంట్ మాత్రమే. ఆపదలో ఉన్న వ్యక్తులకు మాత్రం రక్షణ కవచం. ఢిల్లీ కేంద్రంగా ఉన్న స్టార్టప్ కంపెనీ లీఫ్ వేరబుల్స్ ‘సేఫర్’ పేరుతో దీనిని అభివృద్ధి చేసింది. స్మార్ట్‌ఫోన్‌లో సేఫర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పెయిర్ (అనుసంధానం) చేయాలి. అత్యవసర సమయాల్లో పెండెంట్ వెనకాల ఉన్న చిన్న బటన్‌ను నొక్కితే చాలు. స్మార్ట్‌ఫోన్‌లో ముందుగా నిర్దేశించిన అయిదుగురు వ్యక్తుల మొబైల్స్‌కు సందేశం వెళుతుంది. దర రూ.2,700. కంపెనీ ఇచ్చే జీవితకాల సర్వీసుకు ఎటువంటి చార్జీ ఉండదు.
పెండెంట్‌తో సెల్ఫీ కూడా తీసుకోవచ్చని లీఫ్ వేరబుల్స్ మార్కెటింగ్ డెరైక్టర్ పరాస్ బాత్రా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పెండెంట్ వాడుతున్న వ్యక్తి స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉంటే ఆపద సమయంలో ఏ ప్రాంతంలో ఉన్నది గూగుల్ మ్యాప్ లొకేషన్ చిత్రం రూపంలో అయిదుగురికి చేరుతుంది. నెట్ కనెక్షన్ లేకపోయినా ప్రాంతం చిరునామా సందేశం రూపంలో వెళ్తుంది.
గాడ్జెట్ ఎక్స్‌పో ప్రారంభం
Published Sat, Sep 19 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM
Advertisement
Advertisement