
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల ధరలు రూ.10 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. పూర్తిగా విదేశాల్లో తయారై దిగుమతైన మోటారు వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై ఉన్న దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 15 శాతానికి చేరుస్తూ ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రకటించారు.
ట్రక్కులు, బస్సులకు 20 నుంచి 25 శాతానికి పెంచారు. దీనికితోడు కస్టమ్ డ్యూటీపై 10 శాతం సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ పడనుంది. విడిభాగాలపై పన్ను రెట్టింపై 15 శాతంగా ఉంది. టైర్లపై 10 శాతమున్న దిగుమతి సుంకం కాస్తా 15 శాతానికి చేరింది. కొత్త పన్నులతో మోడల్‌నుబట్టి కారు ధర రూ.1.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అధికం అవుతుందని జర్మనీ కార్ల దిగ్గజం ఔడీ వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయం లగ్జరీ కార్ల పరిశ్రమను నిరుత్సాహపరిచిందని ఆడి ఇండియా హెడ్ రహిల్ అన్సారీ పేర్కొన్నారు.