
మహీంద్రా లాభం రూ.930 కోట్లు
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌లో రూ.930 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.1,230 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. ఆదాయం గత క్యూ3లో రూ.20,680 కోట్లుగా, ఈ క్యూ3లో రూ.18,372 కోట్లుగా ఉందని పేర్కొంది. అనుబంధ కంపెనీల విలీనం కారణంగా ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది.
మహీంద్రా ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ(ఈ కంపెనీ అనుబంధ సంస్థలు కూడా) టెక్ మహీంద్రాలో విలీనమయ్యాయని పేర్కొంది. వాహన విభాగ వ్యాపార ఆదాయం గత క్యూ3లో రూ.11,984 కోట్లుగా, ఈ క్యూ3లో 10,691 కోట్లుగా, ఫార్మ్ ఎక్విప్‌మెంట్ వ్యాపార ఆదాయాలు గత క్యూ3లో రూ.4,668 కోట్లుగా, ఈ క్యూ3లో రూ.4,049 కోట్లుగా ఉన్నాయని వివరించింది. ఆర్థిక సేవల విభాగం ఆదాయం రూ.1,366 కోట్ల నుంచి రూ.1,522 కోట్లకు చేరిందని తెలిపింది.
ఇక స్టాండోలోన్ ప్రాతిపదికన నికర లాభం గత క్యూ3లో రూ. 934 కోట్లు, ఈ క్యూ3లో రూ.942 కోట్లుగా, ఆదాయం గత క్యూ3లో రూ.11,295 కోట్లుగా, ఈ క్యూ3లో రూ.10,188 కోట్లుగా ఉన్నాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపధ్యంలో ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం వృద్ధితో రూ.1,193కు ఎగసింది.