మార్కెట్ పంచాంగం
ప్రపంచానికి గ్రోత్ ఇంజిన్‌గా ఉన్న చైనా వృద్ధి బాగా పడిపోయిందన్న వార్తలు, వివిధ దేశాల కరెన్సీల విలువలు క్షీణించటంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లన్ని గతవారం కుప్పకూలాయి. అయితే ఈ పతనంతో జరిగిన నష్టాల్లో అధిక భాగాన్ని అమెరికా, జపాన్, భారత్ మార్కెట్లు వారాంతంలో పూర్చుకోగలిగాయి. ఈ సంవత్సరం ఆగస్ట్ రెండో వారం వరకు మిగిలిన దేశాల మార్కెట్లతో పోలిస్తే ఈ మూడు దేశాల మార్కెట్లు పటిష్టంగా ట్రేడ్ అవుతూ వచ్చాయి. తిరిగి ఇవే వేగంగా కోలుకోవడం విశేషం.
సెప్టెంబర్ నెలలో జీఎస్‌టీ బిల్లును ఆమోదింపజేయడం కోసం పార్లమెంట్ ఉభయ సభల్ని సమావేశ పరుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది జరిగితే స్టాక్ మార్కెట్లకు సానుకూలాంశం అవుతుంది. ఇక వచ్చే నెల 17న అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు కమిటీ సమావేశం ఉంది. అక్కడ వడ్డీ రేట్లు ఇప్పట్లో పెరిగేది.. లేనిది.. సమావేశం తర్వాత తేలిపోతుంది. అటు తర్వాత మార్కెట్ల ట్రెండ్ నిర్దేశితమౌతుంది. ఇక మన స్టాక్ సూచీల సాంకేతికాంశాలకు వస్తే..
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
గత సోమవారం ఒక్కసారిగా కుప్పకూలిన బీఎస్‌ఈ సెన్సెక్స్ వారాంతంలో కొంత వరకు కోలుకున్నా అంతక్రితం వారంతో పోలిస్తే 974 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. చివరకు 26,392 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం పతనంలో అతి ముఖ్యమైన 25,300 పాయింట్ల స్థాయిని పరీక్షించి, ఆ స్థాయి నుంచి వేగంగా కోలుకోవడం సాంకేతికంగా సానుకూలాంశం. క్రితం ఏడాది ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధించిన రోజైన మే 16 నాటి గరిష్ట స్థాయే ఈ 25,300 పాయింట్ల స్థాయి.
రానున్న వారాల్లో సెన్సెక్స్‌కు ఈ దీర్ఘకాలిక మద్దతు కీలకమైనది. ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగితే క్రితం వారం గరిష్ట స్థాయి అయిన 26,687 పాయింట్ల వద్ద తొలి అవరోధం ఏర్పడవచ్చు. అటుపైన ముగిస్తే 27,131 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఆపైన స్థిరపడితే క్రమేపి 27,400 వద్దకు చేరవచ్చు. ఈ స్థాయి గతంలో కొద్ది వారాల పాటు మద్దతునందిచడం వల్లన ఇక మీదట ఇది సెన్సెక్స్‌కు గట్టి అవరోధం కల్పించే అవకాశం ఉంది. ఈ వారం ప్రస్తుత స్థాయి నుంచి లేదా పైన పేర్కొన్న తొలి నిరోధ స్థాయి నుంచి కిందకు దిగితే వెనువెంటనే 25,940 పాయింట్ల మద్దతు స్థాయికి తగ్గవచ్చు. ఆలోపల తిరిగి 25,300 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.
నిఫ్టీ నిరోధం 8,090-మద్దతు 7,860
సెన్సెక్స్‌లా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంకా 2014 మే 16 నాటి గరిష్ట స్థాయి అయిన 7,563 పాయింట్ల స్థాయిని ఇంకా పరీక్షించలేదు. గతవారం 7,667 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమై, అక్కడి నుంచి రికవరీ జరగడంతో 8,000 పాయింట్ల స్థాయిని దాటింది. అంతక్రితం వారంతో పోలిస్తే 298 పాయింట్ల నష్టంతో 8,002 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం రికవరీ కొనసాగితే నిఫ్టీ 8,090 పాయింట్ల తొలి నిరోధాన్ని చేరవచ్చు. అటుపైన ముగిస్తే 8,225 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 8,300 పాయింట్ల స్థాయిని చేరే అవకాశం ఉంది. ప్రస్తుత స్థాయి వద్ద నిఫ్టీ స్థిరపడలేకపోతే 7,860 పాయింట్ల మద్దతు స్థాయి వద్దకు క్షీణించ వచ్చు. ఈ మద్దతును నిలబెట్టుకోలేకపోతే 7,660-7,560 పాయింట్ల మద్దతు శ్రేణి వద్దకు పతనం కావచ్చు.
నిరోధం 26,687-మద్దతు 25,940
Published Mon, Aug 31 2015 1:57 AM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM
Advertisement