కట్టుదాటిన ‘కరెన్సీ’ యుద్ధం! | currency war between china and usa | Sakshi
Sakshi News home page

కట్టుదాటిన ‘కరెన్సీ’ యుద్ధం!

Published Tue, Jan 12 2016 12:19 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

కట్టుదాటిన ‘కరెన్సీ’ యుద్ధం! - Sakshi

కట్టుదాటిన ‘కరెన్సీ’ యుద్ధం!

రెండోమాట:
కరెన్సీలన్నిటికీ కేంద్ర బిందువుగా డాలర్ స్థానం రక్షణ కోసం అమెరికా ఇతర కరెన్సీల ఉనికిని దెబ్బతీస్తోంది. అందులో భాగంగానే అమెరికాను, దాని కరెన్సీని సవాలు చేస్తూ, ప్రథమ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న చైనాను అది ముందుగా దెబ్బతీసే ప్రయత్నంలో ఉందని నేటి పరిణామాలు సూచనప్రాయంగా వెల్లడిస్తున్నాయి. ఈసారి కరెన్సీ యుద్ధాన్ని అదుపు చేయలేకపోతే, 2007-2008 నాటి అమెరికా ప్రేరిత, ప్రపంచవ్యాపిత ఆర్థిక మాంద్యం కన్నా మించిన సంక్షోభానికి దారితీస్తుందని కూడా నిపుణులు హెచ్చరించవలసి వస్తోంది!

 ‘‘చైనా, అమెరికాల మధ్య, చైనీస్ కరెన్సీ యువాన్, అమెరికన్ డాలర్‌ల మధ్య నేడు ఆయా కరెన్సీల విలువను, ఉనికిని కాపాడుకునేందుకు సాగుతున్న పోరాటం, నేటి ప్రపంచ ద్రవ్య వ్యవస్థకు కేంద్రబిందువుగానూ, ప్రస్తుతం సాగుతున్న మూడవ కరెన్సీ యుద్ధానికి ప్రధాన కేంద్రంగానూ అవతరించింది.’’ (జేమ్స్ రికార్డ్స్, ‘‘కరెన్సీ వార్స్: ది మేకింగ్ ఆఫ్ ది నెక్స్ట్‌గ్లోబల్ క్రైసిస్’’, 2011 పెంగ్విన్ ప్రచురణ, పేజీ. 100)

 ప్రపంచ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థల తీరు తెన్నుల గురించి ఎవరికి తోచిన భాష్యాలు, వ్యాఖ్యానాలు వారు చేయటం మామూలే. అయితే వాటిని తరచి పరిశీలించినప్పుడు వాటితో పూర్తిగా ఏకీభవించలేని లేదా కొన్నింటితో మాత్రమే విభే దించే అంశాలూ ఉంటాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)  ఆంగ్లో-అమెరికన్, యూరోపియన్ ప్రభుత్వాల ‘చేతి ఎత్తు బిడ్డలు’గా అవతరించినవి.    వాటిలో తాముపెట్టిన పెట్టుబడుల మీద ఏటా ఇంతేసి వడ్డీలు మాకు ముట్టచెబుతూ ఉండాలని ఆ దేశాల ప్రభుతాలు శాసిస్తూ వచ్చాయి. ఆ రెండు దోపిడీ సంస్థల్లో ఒకటి,  ‘అభివృద్ధి’ పేరిట కొత్తగా స్వాతంత్య్రం పొందిన నేటి వర్ధమాన దేశాలకు పెట్టుబడుల ‘ఎర’ చూపే ప్రజా వ్యతిరేక సంస్కరణల సంస్థ (వరల్డ్ బ్యాంక్).

కాగా రెండోది అవి ఆ అప్పులు, భారీ వడ్డీలు తీర్చలేనప్పుడు వాటి ఆర్థిక వ్యవస్థలను ‘పునర్వ్యవస్థీకరించే’ పేరిట ‘సంస్కరణల’ను అమలుచేస్తామంటే కొత్త అప్పులు ఇవ్వచూపే సంస్థ (ఐఎంఎఫ్). రెండవ ప్రపంచ యుద్ధం వరకు సకల దేశాల మధ్య ద్రవ్యలావాదేవీలకు నమ్మకమైన మాధ్యమంగా ఉన్నబంగారం విలువను యుద్ధానంతరం అమెరికా ఆకస్మికంగా రద్దు చేసి,  ప్రపంచ దేశాలను ఆర్థికంగా శాసించే డాలర్‌ను మాధ్యమంగా రూపొందించింది. అంటే ప్రపంచ యుద్ధాలు దేశాల మధ్య కరెన్సీ యుద్ధాలకు దారి తీసే సమయం వచ్చింది! సంపన్న పెట్టుబడిదారీ దేశాలు సామ్రాజ్య విస్తరణలో భాగంగా స్వతంత్ర, వర్ధమాన, బడుగు దేశాల ఆర్థిక వ్యవస్థలను తమకు పోటీగా ఎదగకుండా అణగదొక్కే క్రమంలో ఇతర దేశాల కరెన్సీలను, వాటి విలువను దిగజార్చుతూ వచ్చాయి.

సకల సంక్షోభాలకు కర్త అమెరికా
ప్రపంచంలో అమెరికా తర్వాత రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ స్థానాన్ని ‘తోసిరాజని’ ఆ స్థానాన్ని ఆక్రమించి, క్రమంగా ఒకటవ స్థానాన్ని చేపట్టడానికి చైనా ఆర్థిక వ్యవస్థ దూసుకువస్తున్నది. ఈ క్రమపరిణామంలో భాగంగానే గత 15-16 ఏళ్లుగా అమెరికన్ డాలర్ కరెన్సీకి, చైనా యువాన్ పెద్ద పోటీగా అవతరించిందని అమెరికా అధికార ఆర్థిక సలహాదార్లు, నిపుణ ఆర్థికవేత్తలూ పరిగణిస్తూ వచ్చారు. 1930ల నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కారణంగా ముద్రపడిన అమెరికా, 2007 నుంచీ మరిన్ని ఆర్థిక మాంద్యాలకు కారణమైంది. ఆ ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ తేరుకోలేకపోతున్నది. అలాంటి సమయంలో, డాలర్‌కు పోటీగా అమెరికా ఉనికికే ఎసరు పెడుతూ దూసుకువస్తున్న చైనా ప్రగతిని అడ్డుకుని, పక్కదారి పట్టించే మార్గాలు వెతకాలని అమెరికన్ ‘థింక్ టాంక్’ కొందరు నిపుణ మేధావుల పరిశోధనా సంస్థ అమెరికా పాలకులకు సలహా ఇచ్చింది.

ఇందుకు, 2007 నాటి ప్రపంచ సంక్షోభానికి పురుడు పోసిన అమెరికా... అంతకు ముందే తన ఉనికి కోసం, తన దోపిడీ వ్యవస్థ మనుగడ కోసం, తన సైనిక, యుద్ధతంత్ర వ్యాప్తి కోసం, 90 దేశాలలోని తన సైనిక స్థావరాల పోషణ కోసం డాలర్ మారకం విలువను కృత్రిమంగా సంరక్షించుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ప్రపంచీకరణ/సరళీకరణ/కరెన్సీల సంస్కరణీకరణ పేరిట ‘ఏక ధృవ’ ప్రపంచ వ్యవస్థ నిర్మాణం కోసం ప్రయత్నిస్తోంది. ప్రపంచ కరెన్సీలన్నిటికీ కేంద్ర బిందువుగా డాలర్ స్థానం రక్షణ కోసం అది ఇతర కరెన్సీల ఉనికిని దెబ్బతీస్తోంది. అందులో భాగంగానే అమెరికాను, దాని కరెన్సీని సవాలు చేస్తూ, ప్రథమ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న చైనాను ముందుగా దెబ్బతీసే ప్రయత్నంలో అది ఉన్నట్లు, నేడు జరుగుతున్న పరిణామాలు  సూచనప్రాయంగా వెల్లడిస్తున్నాయి. అయితే ఇక్కడొక విషయాన్ని విస్మరించలేం.

 ప్రధాన రిజర్వ్ కరెన్సీలలో ఒకటిగా యువాన్
 సోషలిస్టు దేశాలుగా పేరుమోసిన దేశాలు సరళీకృత విధానాల ప్రభావంలో మితిమీరి, మౌలిక ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తే ఎదురయ్యే పరిణామాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అనేక త్యాగాలతో దోపిడీ వ్యవస్థను వదిలించుకున్న సోషలిస్టు దేశాల ప్రయోజనాలు, పెట్టుబడిదారీ విధాన ప్రయోజనాలు ఒకటి కాజాలావు. రెండింటి పునాదులు వేరు. పెట్టుబడిదారీ విధానం పాత వ్యవస్థా చట్రంపైన దోపిడీ వ్యవస్థ పునాదులపైన నిర్మాణమయ్యేది. సోషలిస్టు వ్యవస్థ అందుకు భిన్నమైంది. నవ క్యూబా అధినేత ఫిడెల్ కాస్ట్రో, ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ‘సోషలిస్టు వ్యవస్థ అంటే కొందరి దృష్టిలో సామాజికులందరినీ సంపన్నులుగా మార్చడమన్న భావన. కానీ అందరికీ కనీస అవసరాలు తీర్చడమే శ్రమపై ఆధారపడిన, సుఖజీవనాన్నిచ్చే వ్యవస్థా నిర్మాణమే సోషలిజం అన్నాడు’. పెట్టుబడిదారీ ‘మార్కెట్ ఆర్థిక వ్యవస్థ’ ప్రయివేట్, కార్పొరేట్ ప్రయోజనాల రక్షణ కోసం కేవలం లాభాల వేటకు ‘పెద్దపీట’ వేసేది.

అందుకు భిన్నమైనదైన ఏ సోషలిస్టు దేశమూ పేరు మార్చుకుని తనదీ సోషలిస్టు మార్కెట్ ఆర్థిక వ్యవస్థే అని బొంకకూడదు. ఆ భ్రమలో జనాన్ని ఉంచడం ద్వారా చైనా వ్యవస్థకు కూడా నష్టం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థనూ, కరెన్సీ విలువనూ బలోపేతం చేసుకోవాలనుకున్న చైనా, తన కరెన్సీ యువాన్ విలువను కట్టడి చేయడం కోసం  అమెరికా కనుసన్నల్లో మెలిగే ఐఎంఎఫ్ ఆధ్వర్యంలోని ప్రధాన రిజర్వ్ కరెన్సీలుగా చెలామణిలో ఉన్న అమెరికన్ డాలర్, బ్రిటిష్ ఫౌండ్, జపనీస్‌యెన్, యూరో కరెన్సీల సరసనే యువాన్‌ను కూడా చేర్చింది. అంతేగాదు. అమెరికా తెచ్చిన ప్రపంచ వ్యాపిత ఆర్థిక సంక్షోభం ప్రభావం వల్ల పతనావస్థలో ప్రవేశించిన చైనా... కరెన్సీ సంక్షోభం వల్ల చైనా మార్కెట్, స్టాక్ మార్కెట్‌ల నుంచిపెట్టుబడులు సంక్షోభం సోకని మార్కెట్లకు ఉడాయించే ప్రమాదం దాపురించింది.

 ‘సంక్షోభం చైనాది కాదు’
 చైనా ఆర్థిక సౌష్టవం ఫలితంగా అనేక కంపెనీలకు కంపెనీలనే చైనా కొనుగోలు చేసి చైనాకు తరలించుకుపోయింది కూడా. విదేశీ వాణిజ్యంలో అమెరికా నుంచి చైనాకు దిగుమతి అయ్యే సరకులు తగ్గి, చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు విపరీతంగా పెరిగిపోవడంతో అమెరికా కోటాను కోట్ల డాలర్లు (3 లక్షల కోట్ల డాలర్లు) చైనాకు బకాయి ఉంది. ఆర్థిక సంక్షోభంలో యువాన్ కరెన్సీ విదేశీ మారకం తగ్గింది. కాని ఈ ట్రిలియన్ డాలర్లలో త గ్గిపోయినది కేవలం 51,200 కోట్ల డాలర్లు మాత్రమే. అందుకే ‘గార్డియన్ న్యూస్ పేపర్స్’కు చెందిన సీనియర్ విశ్లేషకుడు మార్టిన్ జాక్విస్ ‘‘సంక్షోభంలో ఉన్నది చైనా ఆర్థిక వ్యవస్థ కాదు, ఇతర ఆర్థిక వ్యవస్థలేనని’’ వ్యాఖ్యానించాడు (హిందూ: 16-09-2015). అంతే కాదు: ‘‘సుమారు గత 35 ఏళ్లలో చైనా ఆర్థిక పురోగతి అసాధారణం. ప్రస్తుత సంక్షోభ కాలంలో కూడా ఏడాదికి 7 శాతం వృద్ధిని చైనా నమోదు చేసుకుంటోంది.

ఈ సంఖ్య అంతకు ముందరి వృద్ధి రేటు కన్నా తక్కువగా ఉండొచ్చు కానీ పశ్చిమ రాజ్యాలలో సాధించిన ఆర్థిక ప్రగతిని గేలి చేసేదిగా ఉంది. సంక్షోభం నిజానికి చైనాది కాదు. ఇతరులదే’’ అని కూడా ‘‘గార్డియన్’’ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో తాత్కాలిక సంక్షోభ పరిణామాలను పక్కనబెట్టి చూస్తే, చైనాతో తగాదా వల్ల అమెరికా కోల్పోయేది ఎక్కువ, దానికి లాభించేది తక్కువ అని కూడా ప్రొఫెసర్ రికార్డ్స్ వ్యాఖ్యానించారు. నిజానికి ఇప్పటి దాకా దేశాల మధ్య రెండో ప్రపంచ యుద్ధంతో పాటు ప్రపంచ కరెన్సీ యుద్ధాలు కూడా నడిచాయి. మొదటి కరెన్సీ యుద్ధం 1921-1936 మధ్య, రెండవ సారి కరెన్సీ యుద్ధం 1967-1987 మధ్య సాగాయి. ఇక ప్రపంచ దేశాలు మూడవ కరెన్సీ యుద్ధానికి (2010 నుంచి) సన్నద్ధమవుతూ వచ్చాయి.

 కరెన్సీ కయ్యం అదుపు తప్పితే ముప్పే
 దేశాలు తమ కరెన్సీ విలువల్ని ఎందుకు కోత బెట్టుకోవలిసి వస్తోంది? ఏ దేశమైనా తన సరుకుల ఎగుమతుల ద్వారానే ప్రధానంగా తన ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసుకుంటుంది. కరెన్సీ విలువలు పడిపోతే మన ఎగుమతులకు విదేశాలు తక్కువ డబ్బులు చెల్లిస్తాయి. అదే మనం దిగుమతి చేసుకునే సరకులకు మాత్రం మనం ఎక్కువ కరెన్సీని చెల్లించుకోవాల్సి వస్తుంది- ఈ సంకటస్థితికే మరో పేరు ‘అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి’! అందుకే ఈసారి కరెన్సీ యుద్ధాలు గతంలో కన్నా తీవ్రస్థాయిలో ఉండగలవనీ, ఫలితంగా దేశాల ఆర్థిక వ్యవస్థల భవిష్యత్తూ, దేశాల ప్రజల భవిష్యత్తూ ‘త్రిశంకు స్వర్గం’లో వేలాడే పరిస్థితి ఉంటుందని ప్రపంచ నిపుణులు కొందరు ఆందోళన వ్యక్తం చేయవలసి వచ్చింది. ఈసారి కరెన్సీ యుద్ధాన్ని అదుపు చేయలేకపోతే, 2007-2008 నాటి అమెరికా ప్రేరిత, ప్రపంచవ్యాపిత ఆర్థిక మాంద్యం కన్నా మించిన సంక్షోభానికి దారితీస్తుందని కూడా నిపుణులు హెచ్చరించవలసి వస్తోంది!

ఆ పరిస్థ్థితుల్లో, విలువలేని కరెన్సీ నోట్లు ఎన్ని ముద్రించుకున్నా లాభం లేదు. కరెన్సీ విలువలను  తారుమారు చేసి, ఎదుటి వారి కరెన్సీని, ఆర్థిక వ్యవస్థలను పల్టీ కొట్టిద్దామనే తప్పుడు ఆనవాయితీని పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలే ప్రవేశపెట్ట్టాయి. అందుకే చైనా కూడా ‘సోషలిస్టు మార్కెట్ ఎకానమీ’ పేరిట ‘‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’’ అన్నట్టు  వ్యవహరిస్తున్నట్లు కన్పిస్తోంది. పెట్టుబడిదారీ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ గోదాలోకి ఏ పేరుతో దిగిన సోషలిస్టు వ్యవస్థ అయినా ఎత్తుకు పైఎత్తు ఎత్తకుండా రాజకీయంగానూ, సామాజికంగానూ, ఆర్థిక అస్తిత్వపరంగానూ నిభాయించుకు రావటం ‘కుందేటి కొమ్ము’ను సాధించుకురాగల సాహసంగానే మిగిలిపోవచ్చు.!
http://img.sakshi.net/images/cms/2015-07/41437415774_Unknown.jpg   
సీనియర్ సంపాదకులు: ఏబీకే ప్రసాద్(abkprasad2006@yahoo.co.in)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement