
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కార్లను భారీ సంఖ్యలో రీకాల్ చేస్తోంది. ఫ్యూయెల్ పంప్‌లో లోపాలు ఉండటంతో వ్యాగన్ ఆర్, బాలెనో మోడళ్ళను రీకాల్ చేస్తున్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో మారుతి బుధవారం ప్రకటించింది. ఇంధన పంపులో లోపాలు ఉన్నట్టు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉచితంగా ఈ లోపాలను సరిదిద్ది కస్టమర్లకు తిరిగి అందించనున్నామని దేశంలోని అతిపెద్ద ప్రయాణీకుల వాహనాల తయారీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కార్లు వాగన్ ఆర్, బాలెనో (పెట్రోల్ వేరియంట్) 1,34,885 యూనిట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. నవంబర్ 15, 2018-2019 అక్టోబర్ 15 మధ్య తయారైన వ్యాగన్ఆర్ 56,663 కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది. అలాగే జనవరి 8, 2019-నవంబర్ 8, 2019 మధ్య తయారైన బాలెనో 78,222 కార్లను రాబోయే వారాల్లో రీకాల్ చేస్తామని పేర్కొంది. కస్టమర్లకు అదనపు ఖర్చు లేకుండా లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ భర్తీ చేస్తుందని వెల్లడించారు. మోటారు జనరేటర్ యూనిట్‌లో లోపం కారణంగా డిసెంబరులో, 63,493 యూనిట్ల ప్రీమియం సియాజ్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్ 6, ఆగస్టులో 40,618 యూనిట్ల వ్యాగన్ ఆర్ కార్లను స్వచ్ఛందంగా రీకాల్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment