చిన్న కారు.. పెద్ద పోటీ | Maruti Suzuki likely to launch 800cc diesel small car this year | Sakshi
Sakshi News home page

చిన్న కారు.. పెద్ద పోటీ

Published Wed, May 27 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

చిన్న కారు.. పెద్ద పోటీ

చిన్న కారు.. పెద్ద పోటీ

800 సీసీ విభాగంలో లీడర్ ఆల్టోనే
ఇయాన్‌తో సవాలు విసిరిన హ్యుందాయ్
క్విడ్‌తో బరిలోకి దూసుకొచ్చిన రెనో
2016లో నిస్సాన్ 800 సీసీ కారు
వరుసలో టాటా, జనరల్ మోటార్స్ కూడా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆల్టో.. మారుతి సుజుకి తయారు చేస్తున్న ఈ 800 సీసీ కారు ప్రత్యేకతేంటో తెలుసా? భారత్‌లో గత 10 ఏళ్లుగా టాప్ సెల్లింగ్ మోడల్. 2014-15లో అయితే ఏకంగా  2,64,492 ఆల్టో కార్లు అమ్ముడుపోయాయి.

అంటే... ఏడాదికి దాదాపు 26 లక్షల కార్లు అమ్ముడుపోయే భారత మార్కెట్లో 10% వాటా ఈ ఒక్క బ్రాండ్‌దే. అంతకు ముందటి ఏడాదితో పోల్చినా ఇది 2.4% అధికం. మారుతికి ఉన్న బ్రాండ్ విలువకు ఈ కారు 800 సీసీ విభాగంలో ఉండడం ఇంతటి అమ్మకాలకు కారణమన్నది ఆటో రంగ నిపుణుల మాట. ఇంతటి ప్రాధాన్యమున్న 800 సీసీ విభాగంలో హ్యుందాయ్ సంస్థ ‘ఇయాన్’తో బరిలోకి దిగింది. విక్రయాల పరంగా దేశంలో 6వ స్థానంలో నిలిచిన ఈ మోడల్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 78,334 మేర నమోదయ్యాయి. ఈ మార్కెట్ అత్యంత ఆకర్షణీయంగా ఉండటంతో తామూ పోటీలో ఉన్నామంటూ మరిన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
 
సంచలనాలకు వేదిక..
ఎప్పటి నుంచో చిన్నకారు తెస్తామని వాగ్దానం చేస్తూ వచ్చిన రెనో... ఇటీవలే 800 సీసీ ‘క్విడ్’ను మార్కెట్లోకి తెచ్చి సందడి చేసింది. నిజానికి చిన్నకారు కోసం గతంలో నిస్సాన్‌తో జట్టుకట్టినా ఆ భాగస్వామ్యం ఫలవంతం కాలేదు. దీంతో బజాజ్‌తో కలసి చిన్నకారు తయారు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే దాదాపు నమూనాను పూర్తి చేసిన బజాజ్... రెనో అధికారుల్ని ఆహ్వానించి దాన్ని చూపించింది. ఆ మోడల్‌ను మార్కెట్‌కు కూడా చూపించటం గమనార్హం. అయితే ఆ మోడల్ ద్వారా తాము అంతర్జాతీయంగా పోటీ పడలేమని భావించిన రెనో... ఆ భాగస్వామ్యాన్ని కూడా వదులుకుంది. చివరకు తానే సొంతగా భారతీయ ఇంజనీర్లను విశ్వసించి బరి లోకి దిగింది. తన మోడళ్లలో అత్యంత సక్సెస్‌ఫుల్ మోడల్‌గా ఉన్న ‘డస్టర్’కు మినీ రూపమా?... అన్న మాదిరిగా క్విడ్‌ను తయారు చేసి మార్కెట్లోకి తెచ్చింది.

దీంతో ఆల్టో, ఇయాన్, క్విడ్ మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందనేది ఆటో నిపుణుల విశ్లేషణ. క్విడ్ అభివృద్ధికి, చెన్నై ప్లాంటు విస్తరణకు రూ.2,000 కోట్ల దాకా కంపెనీ వెచ్చించింది. ప్రస్తుతమున్న చిన్న కార్లకు భిన్నంగా, అంత్యంత ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ మోడల్‌ను తెచ్చామని రెనో అంటోంది. గ్లోబల్ కారుగా అభివృద్ధి చేసిన క్విడ్‌ను భారత్‌తో పాటు ద క్షిణాఫ్రికా, బ్రెజిల్ తదితర దేశాల్లోనూ విక్రయించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టిపెట్టి ఏటా 10 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు చేస్తామని కంపెనీ ధీమాగా చెబుతోంది. భారత్‌లో కంపెనీ మార్కెట్ వాటా ప్రస్తుతం 2 శాతంగా ఉంది. దీన్ని 2016-17 నాటికి 5 శాతానికి చేరుస్తామని, అందులో క్విడ్ పాత్ర ఎక్కువగా ఉంటుందని రెనో చెబుతోంది.
 
టాటా మోటార్స్ నుంచి..
‘పెలికాన్’ కోడ్ నేమ్‌తో టాటా మోటార్స్ సైతం మరో చిన్నకారును అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం. 800 సీసీ డీజిల్ మోటార్‌తో పెలికాన్‌ను రూపొందిస్తున్నట్టు ఆటో వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కంపెనీ నానో కార్లతో సామాన్యులకూ దగ్గరైంది. 624 సీసీలో పలు నానో మోడళ్లను విక్రయిస్తోంది. అలాగే కైట్ పేరుతో హ్యాచ్ బ్యాక్ మోడల్‌ను రూపొందిస్తోంది. నానోకు, కైట్‌కు మధ్యస్తంగా పెలికాన్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పెలికాన్ 800 సీసీ కారు ధర రూ.2.5 లక్షలు ఉండే అవకాశముంది.
 
స్పార్క్ ప్లాట్‌ఫామ్‌పై జీఎం కొత్త కారు..
జనరల్ మోటార్స్(జీఎం) సైతం 800 సీసీ విభాగంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. మార్కెట్లో ఉన్న మోడళ్ల కంటే తక్కువ ధరను నిర్ణయించడం ద్వారా అమ్మకాలను పెంచుకోవాలన్నది కంపెనీ ఆలోచన. షెవర్లే స్పార్క్ ప్లాట్‌ఫామ్‌పై కారును అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మారుతి సుజుకీ 800 సీసీ డీజిల్ ఇంజన్‌ను ఒకటిరెండు నెలల్లో ఆవిష్కరించనుంది. వ్యాన్లు, ఇతర యుటిలిటీ వాహనాలను మినహాయిస్తే దేశంలో అన్ని కంపెనీలవీ కలిపి దేశవ్యాప్తంగా 2014-15లో 18,76,017 కార్లు అమ్ముడయ్యాయి.
 
వచ్చే ఏడాది నిస్సాన్ కూడా..
చెన్నైలో నిస్సాన్-రెనోలకు ఉమ్మడి ప్లాంటుంది. ఏటా 4 లక్షల యూనిట్లను తయారు చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌ను రెండూ సమానంగా ఉపయోగించుకుంటున్నాయి. దీన్లోనే క్విడ్ మోడల్‌ను రెనో అభివృద్ధి చేసింది. చిన్న కార్ల తయారీ కోసం రెండు సంస్థలూ రూపొందించిన కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ ప్లాట్‌ఫామ్‌పై క్విడ్ రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఇదే ప్లాట్‌ఫామ్‌పై నిస్సాన్ సైతం ‘రెడీ-గో’ పేరిట 800 సీసీ కారును అభివృద్ధి చేస్తోంది. నిస్సాన్ లోకాస్ట్ కార్ బ్రాండ్ అయిన డాట్సన్ నుంచి ఇది విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మోడల్ రోడ్డెక్కుతుందని, ధర రూ.2.5 లక్షల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement