మారుతీ కార్ల రేట్లకు రెక్కలు
ఇదే బాటలో హ్యుందాయ్ కూడా...
వచ్చే నెల నుంచి పెంపు వర్తింపు
న్యూఢిల్లీ: కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను తట్టుకోవడానికి, అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే బీఎండబ్ల్యూ, జనరల్ మోటార్స్(జీఎం) ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా... తాజాగా మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలు కూడా ఇదే బాటలో పట్టాయి. ధరల పెరుగుదల వచ్చే నెల నుంచి వర్తిస్తుంది.
మారుతీ పెంపు 2-4 శాతం
మారుతీ కంపెనీ తన అన్ని మోడళ్ల కార్ల ధరలను 2-4% పెంచుతోంది. ఈ పెరుగుదల వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో ధరలను పెంచామని, అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ ధరలను పెంచలేదని పేర్కొన్నారు. ఉత్పత్తి వ్యయాలు పెరుగుదలను ఇప్పటివరకూ భరించగలిగామని, ఇక ఇప్పుడు ధరలను పెంచక తప్పడం లేదని వివరించారు. మారుతీ సుజుకీ కంపెనీ రూ.2.37 లక్షల ధర ఉన్న ఆల్టో 800 నుంచి రూ.24.6 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్న గ్రాండ్ విటారా వరకూ కార్లను విక్రయిస్తోంది.
హ్యుందాయ్ పెంపు రూ. 25,000...
హ్యుందాయ్ కార్ల ధరలను రూ.5,000 నుంచి రూ. 25,000 వరకూ పెంచుతున్నట్లు ప్రకటిం చింది. అధిక ఉత్పత్తి వ్యయాలు, రూపాయి క్షీణించడంతో ధరల పెంపు అనివార్యమైందని హ్యుందాయ్‌ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్, మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. ఇప్పటికే బీఎండబ్ల్యూ 5% వరకూ, జీఎం రూ.5,000-25,000 రేంజ్‌లో కార్ల కార్ల ధరలను పెంచాయి. ధరలను 1-2% రేంజ్‌లో పెంచుతామని టాటా మోటార్స్, మహీంద్రా గత నెలలోనే వెల్లడించాయి.