న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో చిన్న కార్లకు డిమాండ్ పుంజుకుంటుందని వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా స్పష్టం చేసింది. భారత ఆర్థిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో తక్కువ ధరకు లభించే చిన్న కార్లు అవసరమని విశ్వసిస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ తెలిపారు.
కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘చిన్న కార్ల డిమాండ్‌లో తాత్కాలికంగా ప్రస్తుతం డిమాండ్ తగ్గింది. అయితే ఇది కంపెనీ వ్యూహాన్ని మార్చబోదు. స్కూటర్ వాడుతున్న వారు దేశంలో భారీ సంఖ్యలో ఉన్నారు. సమీప భవిష్యత్తులో వీరు కార్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. సురక్షిత, సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలను వారు కోరుకుంటున్నారు. కాబట్టి సామాన్యుడికి అందుబాటులో ఉండే చిన్న కార్లకు భవిష్యత్తులో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. భారత్‌లో పెద్ద, విలాసవంత వాహనాలు మాత్రమే ఉంటే సరిపోదు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో విక్రయాలు, సేవా నెట్‌వర్క్‌ను కంపెనీ మరింత బలోపేతం చేస్తోంది’ అని తెలిపారు.
ఆరు ఈవీ మోడళ్లు..
కంపెనీ నుంచి ఆరు ఎలక్ట్రిక్ మోడళ్లు 2030–31 నాటికి భారత్‌లో రంగ ప్రవేశం చేస్తాయని భార్గవ వెల్లడించారు. ‘కొన్ని నెలల్లోనే భారత్‌లో మారుతీ సుజుకీ తొలి ఈవీ రానుంది. ఈ కార్లను యూరప్, జపాన్‌కు ఎగుమతి చేస్తాం. 2030–31 నాటికి 40 లక్షల యూనిట్లకు తయారీ సామర్థ్యం పెంచుకుంటాం. 7.5–8 లక్షల యూనిట్లు ఎగుమతి చేస్తాం. 2024–25లో 3 లక్షల యూనిట్లు ఎగుమతులు జరగొచ్చు. హరియాణాలో 10 లక్షల యూనిట్ల సామర్థ్యంతో రూ.18,000 కోట్లతో ఏర్పాటు కానున్న ప్లాంటులో 2025–26లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment